Reynolds 045: పెన్నుల ఉత్పత్తి నిలిపివేస్తారంటూ వార్త వైరల్..స్పందించిన సంస్థ

Reynolds 045:  పెన్నుల   ఉత్పత్తి నిలిపివేస్తారంటూ వార్త వైరల్..స్పందించిన సంస్థ
X
అధికారిక సమాచారం కోసం సంస్థ వెబ్‌సైట్ చూడాలని సూచన

రెనాల్డ్స్ 045.. పెన్ను గురించి తెలీని ఒక తరం వారు ఉండరంటే అతి శయోక్తి కాదేమో. ఎందరో విద్యార్థులు తొలిసారిగా వినియోగించిన పెన్ను ఇదే. స్కూలు రోజులు గుర్తొచ్చిన ప్రతిసారీ కళ్లముందు కచ్చితంగా మెదిలేది రెనాల్డ్స్. దానితో ఆడిన ఆటలు, రాసిన రాతలు ఇలా ఓ తరం విద్యార్థుల జీవితాలతో ముడిపడిన పెన్ను ఇకపై మార్కెట్లో కనబడదంటూ ఓ వార్త ఇటీవల నెట్టింట్లో వైరల్ అవుతూ కలకలం రేపింది.

90skid అనే ట్విటర్ పేజ్‌లో Reynolds 045 Fine Carbure will no longer be available in market, end of an era..💔 అని ఒక పోస్ట్ కనిపించింది. లక్ష మందికి పైగా ఫాలోవర్స్‌ ఉన్న ఆ పేజ్‌లో పెట్టిన ఈ పోస్ట్‌కు ఇప్పటిదాకా 2.7 మిలియన్ వ్యూస్ వచ్చాయంటే ఈ పోస్ట్‌కు జనాలు ఎలా కనెక్ట్ అయ్యారో అర్థం చేసుకోవచ్చు. ఆ పోస్ట్ పెను దుమారం సృష్టించింది. దీంతో ఈ పెన్నుతో ప్రత్యేక అనుబంధం ఉన్న వారందరూ సోషల్ మీడియా వేదికగా ఆందోళన వ్యక్తం చేశారు. నెటిజన్లు ఈ కలంతో తమ స్నేహం గురించి పోస్టులు పెట్టారు. అప్పట్లో ఈ పెన్ లో ఇంక్ అయిపోతే రీఫిల్ మార్చి వాడుకునేవాళ్ళం అని, పెన్ పోయిలా మళ్లీ ఇలాంటి పెన్నే కొనేవారమని గుర్తు చేసుకున్నారు.



విషయం వైరల్ అవ్వడంతో రెనాల్డ్స్ సంస్థ స్వయంగా స్పందించింది. ఆ వార్తలన్నీ అవాస్తవమని ప్రకటించింది. రెనాల్డ్స్ 045 తయారీని ఆపే ప్రసక్తే లేదని స్పష్టం చేసింది. 45 సంవత్సరాలుగా ఇండియన్ మార్కెట్‌లో తమ ఉత్పత్తులను ఆదరిస్తున్నారని, ఈ ప్రోత్సాహంతో మరింత మెరుగైన వస్తువులను అందించేందుకు కృషి చేస్తామని రెనాల్డ్స్ కంపెనీ పోస్ట్ చేసింది. ఇటీవల సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వార్తలు అవాస్తవమని, వీటిని చూసి ఎవరూ ఆందోళన చెందవద్దని పేర్కొంది. అంతేకాకుండా, రెనాల్డ్స్‌కు సంబంధించి వాస్తవ సమాచారం కోసం సంస్థ అధికారిక వెబ్‌సైట్, సోషల్ మీడియా పేజీలను మాత్రమే చూడాలని విజ్ఞప్తి చేసింది. పెన్ను డిజైన్‌లో ఎటువంటి మార్పులు చేయమని కూడా స్పష్టం చేసింది.

Tags

Next Story