Indian Railways: భార్యాభర్తల గొడవతో రైల్వేకి రూ.3కోట్లు నష్టం..

భార్యాభర్తల మధ్య తలెత్తిన వివాదంతో రైల్వేకి మూడు కోట్ల నష్టం వాటిల్లింది. ఓకే’ అన్న రెండక్షరాల పదం ఓ దాంపత్య జీవితంలో నిప్పులు పోసి, భారతీయ రైల్వేకు భారీ నష్టాన్ని తెచ్చిపెట్టింది. నమ్మశక్యం కాకున్నా ఇది నిజం. విశాఖపట్టణానికి చెందిన రైల్వే స్టేషన్ మాస్టర్ అక్టోబర్ 12, 2011న చత్తీస్‌గఢ్‌లోని దుర్గ్‌కు చెందిన మహిళను వివాహం చేసుకున్నారు. ఒకరోజు స్టేషన్ మాస్టర్ విధుల్లో ఉండగా ఫోన్ చేసిన భార్య వాగ్వివాదానికి దిగింది. దీంతో అతడు.. ‘ఓకే, మనం ఇంటి దగ్గర మాట్లాడుకుందాం’ అని ఫోన్ పెట్టేశాడు. సరిగ్గా ఇదే అతడి కొంప ముంచింది.
అదే సమయంలో రేడియో ట్రాన్స్‌మిషన్‌ను పట్టుకుని ఉన్న మరో స్టేషన్‌లోని స్టేషన్ మాస్టర్‌కు ‘ఓకే’ అన్న పదం వినిపించడంతో ఆయన తప్పుగా అర్థం చేసుకున్నారు. గూడ్స్ రైలు డిస్పాచ్‌కు ఆయన ‘ఓకే’ చెప్పారనుకుని భావించి రైలుకు సిగ్నల్ ఇచ్చారు. ఆ రైలు మావోయిస్టు ప్రభావిత నిషిద్ధ ప్రాంతం గుండా బయలుదేరింది. రాత్రి పరిమితులను ఉల్లంఘించి అనధికారిక మార్గంలో రైలు ప్రయాణించినందుకు గాను రైల్వే రూ. 3 కోట్ల జరిమానా చెల్లించాల్సి వచ్చింది. ఫలితంగా స్టేషన్ మాస్టర్ సస్పెండయ్యారు. దీనంతటికీ భార్యే కారణమని భావించిన స్టేషన్ మాస్టర్ భార్య నుంచి విడాకులు కావాలంటూ కోర్టుకెక్కారు.
మరోవైపు, భర్త, అతని కుటుంబ సభ్యులు తనను హింసిస్తున్నారంటూ ఆయన భార్య సుప్రీంకోర్టును ఆశ్రయించారు. సుప్రీంకోర్టు ఈ కేసును దుర్గ్ ఫ్యామిలీ కోర్టుకు బదిలీ చేసింది. అక్కడ విడాకుల పిటిషన్ తిరస్కరణకు గురికావడంతో స్టేషన్ మాస్టర్ ఛత్తీస్‌గఢ్ హైకోర్టును ఆశ్రయించారు. దాదాపు 12 ఏళ్ల తర్వాత తాజాగా హైకోర్టులో స్టేషన్ మాస్టర్‌కు అనుకూలంగా తీర్పు వచ్చింది.
వివాహమైన తర్వాత కూడా ఆమె తన మాజీ లవర్‌తో సంబంధం కొనసాగిస్తున్నదని, అందులో భాగంగానే భర్త, కుటుంబ సభ్యులపై అదనపు కట్నం, హింస ఆరోపణలు చేస్తున్నదని గుర్తించిన న్యాయస్థానం విడాకులు మంజూరు చేసింది. భార్య ప్రవర్తన క్రూరంగా ఉందని, ఆమె చర్యలు భర్తను మానసిక క్షోభకు గురిచేశాయని, రైలు ఘటనకు భార్యే బాధ్యత వహించాలని స్పష్టం చేసింది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com