Up Encounter: యూపీలో మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ ఎన్కౌంటర్

ఉత్తర్ ప్రదేశ్‌లో ఓ మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ ఎన్‌కౌంటర్‌లో హతమయ్యాడు. దోపిడీలు, పలు హత్య కేసుల్లో నిందితుడై మోస్ట్ వాంటెడ్‌గా ఉన్న గుఫ్రాన్ అనే నేరస్థుడ్ని పోలీసులు ఎన్‌కౌంటర్ చేశారు. మంగళవారం తెల్లవారుజామున కౌశాంబి జిల్లాలో జరిగిన ఎన్‌కౌంటర్‌లో గుఫ్రాన్ చనిపోయినట్టు పోలీసులు ప్రకటించారు.
హత్యలు, అత్యాచారాలు, దోపీడీలకు నిలయంగా మారిపోయిన యూపీలో నేరస్థులపై యోగి సర్కారు ఉక్కుపాదం మోపుతోంది. ఎన్‌కౌంటర్ భయం నేరస్థులు సైతం గడగడలాడిస్తోంది. గ్యాంగ్ స్టర్ అతిక్ అహ్మద్ హత్య, అతని కొడుకు అసద్ ఎన్ కౌంటర్ తర్వాత రాష్ట్రం ఒక్కసారిగా ఉలిక్కి పడింది. ఇప్పుడు తాజాగా గుప్రాన్ ఎన్కౌంటర్ తో మరోసారి కలకలం మొదలైంది. సుల్తాన్‌పూర్, ప్రతాప్‌గఢ్ జిల్లాల్లో హత్యలు, హత్యాయత్నం, దోపిడీ సహా మొత్తం 13 కేసుల్లో గుఫ్రాన్ నిందితుడు. పోలీసులు అతడి తలపై రూ.లక్షా పాతిక వేలు రివార్డు కూడా ప్రకటించారు. చాలాకాలంగా దొరక్కుండా తప్పించుకు తిరుగుతున్న గుఫ్రాన్ కోసం స్పెషల్ టాస్క్ ఫోర్స్ తీవ్రంగా గాలిస్తోంది. ఈ నేపథ్యంలో
మంగళవారం ఉదయం అతడు కౌశాంబి జిల్లా మంఝాన్‌పూర్ సమీపంలోని సందా సుగర్ మిల్లు వద్ద పోలీసుల కంటబడ్డాడు. పట్టుకోడానికి ప్రయత్నించిన పోలీసులపై దాడి చేయడంతో పోలీసులు కాల్పులు జరపాల్సి వచ్చిందని చెబుతున్నారు. తీవ్రంగా గాయపడిన గుఫ్రాన్ ను ఆస్పత్రికి తరలించగా, అప్పటికే మృతిచెందినట్టు వైద్యులు ధ్రువీకరించారు. గుప్రాన్ పై ఉన్న రివార్డును ప్రయాగరాజ్, సుల్తాన్పూర్ పోలీసులకు ఇస్తున్నట్టు పోలీసు ఉన్నతాధికారులు ప్రకటించారు.
ఇక, 2017లో యోగి ఆదిత్యనాథ్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టనప్పటి నుంచి ఇప్పటి వరకూ ఉత్తర్‌ప్రదేశ్‌లో మొత్తం 10,900 ఎన్‌కౌంటర్లు జరుగగా 185 మంది కరడు గట్టిన నేరస్థులు హతమయ్యారు. గ్యాంగ్‌స్టర్ అనిల్ దుజానాను ఎస్టీఎఫ్ పోలీసులు నాలుగు రోజుల కిందట ఎన్‌కౌంటర్ చేశారు. యూపీలో సంచలనం సృష్టించిన ఉమేశ్ పాల్ హత్య కేసులో నిందితులుగా ఉన్న గ్యాంగ్ స్టర్, మాజీ ఎంపీ అతీక్ అహ్మద్ కుమారుడు అసద్, మరో నిందితుడు గుల్హామ్ పోలీసులు జరిపిన ఎదురుకాల్పుల్లో హతమయ్యారు. తర్వాత అతీక్ అహ్మద్, అతడి సోదరుడు అష్రాఫ్‌లను ముగ్గురు వ్యక్తులు కాల్చి చంపారు. వరుస ఎన్కౌంటర్ లపై విపక్షాలు మండిపడుతున్నాయి.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com