Soniya Gandhi: దేశ విభజన కోసమే వక్ఫ్ బిల్లు ఆమోదం

లోక్‌సభలో వక్ఫ్ సవరణ బిల్లు ఆమోదం పొందడంపై కాంగ్రెస్ అగ్ర నాయకురాలు సోనియాగాంధీ తీవ్రంగా స్పందించారు. రాజ్యాంగంపై నిస్సిగ్గుగా దాడి జరిగిందని అభిప్రాయపడ్డారు. గురువారం రాజ్యసభలోకి వెళ్లే ముందు సోనియాగాంధీ మీడియాతో మాట్లాడారు. సమాజంలో శాశ్వత విభజనను తీసుకొచ్చేందుకు బీజేపీ ప్రయత్నిస్తోందని.. అందులో భాగంగానే వక్ఫ్ బిల్లును ఆమోదించినట్లుగా వ్యాఖ్యానించారు. దిగువ సభలో బిల్లును బుల్డోజర్ చేశారని చెప్పారు. అలాగే వన్ నేషన్ వన్ ఎలక్షన్ బిల్లును కూడా రాజ్యాంగాన్ని అపహాస్యం చేసేందుకే సభలోకి తీసుకొస్తున్నారని సోనియాగాంధీ ధ్వజమెత్తారు.
మోడీ నిర్ణయాలు కారణంగా దేశం అగాధంలోకి నెట్టబడుతోందని.. ఈ నిర్ణయాలను తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. రాజ్యాంగం కాగితంపైనే ఉంటుంది.. అందుకే దాన్ని బుల్డోజర్ చేయడమే బీజేపీ లక్ష్యమని పేర్కొన్నారు. న్యాయం కోసం ఎంపీలంతా కలిసి పోరాడాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. ఇక పార్లమెంట్ ఉభయ సభల్లో ప్రతిపక్షాలకు మాట్లాడే అవకాశమే ఇవ్వడం లేదని.. తరచుగా గందరగోళం సృష్టిస్తున్నారని ఆరోపించారు.
వక్ఫ్ సవరణ బిల్లుకు లోక్‌సభలో ఆమోదం లభించింది. బుధవారం బిల్లుపై పార్లమెంట్‌లో వాడీవేడీగా చర్చ జరిగింది. దాదాపు 12 గంటల పాటు అధికార-ప్రతిపక్ష సభ్యులు ప్రసంగించారు. అర్ధరాత్రి దాటిన తర్వాత బిల్లు ఆమోదం కోసం లోక్‌సభ స్పీకర్ ఓంబిర్లా ఓటింగ్ నిర్వహించారు. బిల్లుకు అనుకూలంగా ఓటింగ్ పడడంతో ఆమోదం పొందింది. బిల్లుకు అనుకూలంగా 282 మంది ఓటు వేయగా.. 232 మంది సభ్యులు బిల్లును వ్యతిరేకించారు. ఇక గురువారం ఈ బిల్లు రాజ్యసభకు రానుంది. ఇక్కడ కూడా దాదాపు 8 గంటల పాటు చర్చ జరగనుంది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com