Supreme Court: భార్యాభర్తలు కొట్లాడుకునేందుకు కోర్టులే దొరికాయా?: సుప్రీంకోర్టు

భార్యాభర్తలు కలహించుకోవడానికి కోర్టులే దొరికాయా? అంటూ సుప్రీంకోర్టు తీవ్ర అసహనం వ్యక్తం చేసింది. వైవాహిక జీవితంలో తలెత్తే గొడవలకు కోర్టులను యుద్ధభూములుగా మార్చుకుని వ్యక్తిగత కక్ష సాధింపులకు ఉపయోగించుకోవడాన్ని అనుమతించలేమని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. కోర్టుల్లో ఆరోపణలు, ప్రత్యారోపణలతో కేసులను మరింత జటిలం చేయటం తప్ప సమస్య పరిష్కారం కాదని పేర్కొంది. ఈ నేపథ్యంలో త్వరితగతిన పరిష్కారం కోసం మధ్యవర్తిత్వ మార్గాన్ని అనుసరించడం మంచిదని సూచించింది. ఈ విధానం ద్వారా అనేక కేసుల్లో సానుకూల ఫలితాలు వస్తున్నాయని తెలిపింది.
వివాహం జరిగిన తర్వాత కేవలం 65 రోజులే కలిసి జీవించి, దాదాపు పదేళ్లుగా వేరువేరుగా ఉంటున్న ఓ జంటకు సంబంధించిన కేసు విచారణ సందర్భంగా జస్టిస్ రాజేశ్ బిందాల్, జస్టిస్ మన్మోహన్‌లతో కూడిన సుప్రీంకోర్టు ధర్మాసనం ఈ వ్యాఖ్యలు చేసింది. ఈ వివాహ బంధం పూర్తిగా కోలుకోలేని స్థితికి చేరుకుందని పేర్కొంటూ, ఆర్టికల్ 142 కింద ఉన్న విస్తృత అధికారాలను వినియోగించి విడాకులు మంజూరు చేసింది.
వైవాహిక వివాదాల్లో ఇరుపక్షాలు సమస్యను పరిష్కరించడంపై కాకుండా, అవతలి పక్షానికి ఎలా బుద్ధి చెప్పాలనే దానిపైనే ఎక్కువగా దృష్టి పెడుతున్నట్లు ధర్మాసనం ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. కొన్నిసార్లు కృత్రిమ మేధ వంటి సాంకేతికతలను ఉపయోగించి తప్పుడు ఆధారాలు సృష్టిస్తున్న ఘటనలు పెరుగుతున్నాయని ఆందోళన వ్యక్తం చేసింది. ఇటువంటి వివాదాలు సమాజంపై ప్రతికూల ప్రభావం చూపుతాయని పేర్కొంటూ, కోర్టులకు వెళ్లే ముందు కుటుంబ సభ్యులు, ఇతరులు ఇతర మార్గాల ద్వారా సమస్యలను పరిష్కరించేందుకు ప్రయత్నించాలని సూచించింది.
Tags
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com
