Water crisis : బెంగళూరులో నీటి కటకట

Water crisis : బెంగళూరులో నీటి కటకట
తాగు నీటిని ఇతర కారణాలకు వాడితే రూ.5 వేల ఫైన్‌

కర్ణాటక రాజధాని బెంగళూరులో నీటి కొరత తీవ్రస్థాయికి చేరింది. రిజర్వాయర్లలో నీరు అడుగంటడమే దీనికి కారణం. బోర్‌వెల్‌లు కూడా ఎండిపోతున్నాయి. మరోవైపు నీటి ట్యాంకర్ల నిర్వాహకులు ఇష్టానుసారంగా అధిక ధరలు వసూలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో నగర వ్యాప్తంగా ఉన్న నివాసితుల సంక్షేమ సంఘాలు వాహనాలను కడగడంపైనా, స్విమ్మింగ్‌పూల్‌ కార్యకలాపాలపైనా పూర్తిస్థాయి నిషేధం విధించాయి. చేతులు, ముఖం శుభ్రం చేసుకోడానికి డిస్పోజబుల్‌ వస్తువులు, తడి గుడ్డలు వినియోగించే అంశాన్ని పరిశీలించాలని దక్షిణ బెంగళూరులోని ఒక ప్రముఖ అపార్ట్‌మెంట్‌లోని నివాసితుల సంక్షేమ సంఘం ప్రతిపాదించింది.

ఈ నేపధ్యంలో సమస్యను ఎదుర్కొనేందుకు కర్ణాటక ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. ఇకపై బెంగళూరులో కార్ వాషింగ్, గార్డెనింగ్, నిర్మాణ పనులు, వాటర్ ఫౌంటైన్‌లు మొదలైన వాటికి తాగు నీటిని వినియోగించడంపై నిషేధం విధించింది. ఒకవేళ ఎవరైనా ఈ నిబంధనను ఉల్లంఘిస్తే రూ.5,000 జరిమానా విధిస్తామని కర్ణాటక నీటి సరఫరా మురుగునీటి బోర్డు ప్రకటించింది. బెంగళూరు నగరంలో వేలాది బోర్‌వెల్‌లు ఎండిపోవడంతో నీటి ఎద్దడి ఏర్పడిందని పలువురు అంటున్నారు. 2023లో వర్షాభావ పరిస్థితుల కారణంగా కర్ణాటక రాజధాని బెంగళూరు ఇటీవల అత్యంత తీవ్రమైన నీటి సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది.బెంగళూరులోని కుమారకృపా రోడ్‌లో కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య నివాసం ఉన్న భవనంలో కూడా వాటర్ ట్యాంకర్లు దర్శనమిస్తున్నాయంటే పరిస్థితి ఎంత తీవ్రంగా ఉందో అర్థం చేసుకోవచ్చు.

1.3 కోట్ల జనాభా ఉన్న బెంగళూరుకు రోజువారీ నీటి అవసరాల్లో 1,500 MLD (మిలియన్ లీటర్లు పర్ డే) కొరతను ఎదుర్కొంతోంది. నీటి కొరతను అధిగమించేందుకు కర్ణాటక ప్రభుత్వం ప్రత్యామ్నాయ మార్గాలు అన్వేషిస్తోంది. రీసైకిల్ చేసిన ట్రీటెట్ వాటర్ వాడుకునేందుకు నివాస కాలనీలు, అపార్ట్‌మెంట్ అసోసియేషన్లను ప్రోత్సహిస్తోంది. అక్రమ నీటి ట్యాంకర్ కార్యకలాపాలను అరికట్టేందుకు హెల్ప్‌లైన్‌లు, కంట్రోల్ రూమ్‌లను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. మరోవైపు ప్రైవేటు వాటర్ ట్యాంకర్లు భారీగా రేట్లు పెంచేశారని ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి.

బెంగళూరు మాత్రమే కాదు కర్ణాటక రాష్ట్రవ్యాప్తంగా కూడా తాగు నీటి సమస్య ఉంది. తుమకూరు, ఉత్తర కన్నడ జిల్లాలు అధికంగా నీటి సమస్యను ఎదుర్కొంటున్నట్టు రెవెన్యూ శాఖ వెల్లడించింది. రాష్ట్రంలోని 236 తాలూకాలు కరువు పీడిత ప్రాంతాలుగా ప్రకటించబడ్డాయి. ఇందులో 219 తాలూకాల్లో తీవ్ర కరువు పరిస్థితులు నెలకొన్నాయి.

Tags

Read MoreRead Less
Next Story