Wayanad landslides: నేటి నుంచి రాడార్‌లతో శోధన

కేరళలో ప్రకృతి విలయానికి కకావికలమై ఆచూకీ గల్లంతైనవారిని గుర్తించడానికి సాంకేతికతను పూర్తిస్థాయిలో వాడుకోవడంపై అధికార యంత్రాంగం దృష్టి సారించింది. ఎక్కడెక్కడ ఎవరు చిక్కుకుపోయారో తెలుసుకునేందుకు డ్రోన్లు, రాడార్లు, మొబైల్ ఫోన్ల సిగ్నళ్ల ద్వారా ముమ్మర ప్రయత్నం కొనసాగుతోంది. బాధితుల జీపీఎస్ అక్షాంశ, రేఖాంశ వివరాలు తెలిస్తే అక్కడకు బలగాలను పంపించాలని సమాయత్తమవుతున్నారు. 218 మంది ఆచూకీ లభ్యం కావాల్సి ఉండడంతో శిథిలాల కింద సజీవంగా ఉన్నవారిని గుర్తించేందుకు డ్రోన్ ఆధారిత రాడార్‌ను నేడు ఉపయోగించనున్నారు. బాధితులు చివరిసారి చేసిన ఫోన్‌కాల్ ఏ ప్రాంతం నుంచి వచ్చిందో తెలుసుకుని అక్కడకు చేరుకోవాలని ప్రయత్నిస్తున్నారు. కొండప్రాంతాల్లో రహదారి సదుపాయం లేకపోవడంతో సైన్యం సాయంతో తాత్కాలికంగా నిర్మించిన 190 అడుగుల పొడవైన బెయిలీ వంతెన ద్వారా యంత్ర సామగ్రిని, ఆహారాన్ని తరలించగలుగుతున్నారు.
పడవెట్టి కున్ను అనే ప్రాంతంలో ఒక ఇంటినుంచి ఒకే కుటుంబంలోని నలుగురిని బలగాలు రక్షించగలిగాయి. కొండచరియలు భారీగా పడడంతో నాలుగు రోజులుగా ఆ ఇంటికి మిగతా ప్రాంతంతో సంబంధం లేకుండాపోయింది. వారి బంధువుల ద్వారా సమాచారం తెలుసుకుని బలగాలు అక్కడకు చేరుకున్నాయి. వయనాడ్‌లో ఇంతవరకు ప్రాణాలు కోల్పోయినవారి సంఖ్య 210కి, గాయాలపాలైనవారి సంఖ్య 264కు చేరింది. మట్టి, బురదలో కూరుకుపోయిన ఇళ్లను తొలగించిన తర్వాత కచ్చితమైన వివరాలు బయటకు వస్తాయని అధికారులు చెబుతున్నారు. పలుచోట్ల మృతదేహాల భాగాలు లభ్యమవుతుండడంతో వాటిని జన్యు పరీక్షలకు పంపిస్తున్నారు. ఎన్డీఆర్‌ఎఫ్, సైన్యం, తీరగస్తీ దళం, నౌకాదళం తదితర విభాగాలవారితో కూడిన బృందాలు జోన్లవారీగా జల్లెడపడుతున్నాయి.
వయనాడ్‌లో బాధిత కుటుంబాల కోసం కాంగ్రెస్ తరఫున వందకి పైగా ఇళ్లు కట్టిస్తామని ఆ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ తెలిపారు. సోదరి ప్రియాంకాగాంధీతో కలిసి వరసగా రెండోరోజు కూడా క్షేత్రస్థాయిలో పర్యటించిన ఆయన.. స్థానిక అధికారులతో సమావేశం అనంతరం మీడియాతో మాట్లాడారు. ఇంతటి భయానక విషాదాన్ని మునుపెన్నడూ చూడలేదని ఆవేదన వ్యక్తంచేశారు. ఈ పరిణామాన్ని భిన్నంగా చూడాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరతానన్నారు. చాలామంది బాధితులు ఆయా ప్రాంతాలకు తిరిగి వెళ్లడానికి ఇష్టపడడం లేదని చెప్పారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com