Central Home Minister Amit Shah : అవినీతిపరులను తలకిందులుగా వేలాడదీస్తాం : అమిత్ షా

అవినీతిపరులను తలకిందులుగా వేలాడదీస్తామని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నారు. అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఝార్ఖండ్‌లోని పాలము ప్రాంతంలో నిర్వహించిన ఎన్నికల ర్యాలీలో ఆయన పాల్గొని ప్రసంగించారు. ఝార్ఖండ్ ముక్తి మోర్చా సంకీర్ణ ప్రభుత్వం దేశంలోనే అత్యంత అవినీతిమయ సర్కారుగా మారిందని.. ఇకనైనా ప్రజలు వారిని గద్దె దించాలని ప్రజలకు పిలుపునిచ్చారు. రాష్ట్రంలో చొరబాటుదారులను అరికట్టడం కేవలం మోదీ నాయకత్వంలోని బీజేపీ వల్లే సాధ్యమవుతోందన్నారు. ఓబీసీ కోటాకు వ్యతిరేకంగా కాంగ్రెస్ మహారాష్ట్రలోని కొన్ని వర్గాలకు 10శాతం రిజర్వేషన్లు కల్పిస్తామని హామీ ఇచ్చిందని.. అయితే మత ప్రాతిపదికన రిజర్వేషన్లకు భాజపా వ్యతిరేకం అనే విషయాన్ని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ గుర్తుంచుకోవాలని అమిత్ షా అన్నారు. జమ్మూకశ్మీర్ ఎన్నటికీ భారత్‌లో అంతర్భాగమేనని.. ఎన్ని తరాలు వచ్చి అడిగినా ఆర్టికల్ 370ని పునరుద్ధరించే అవకాశం లేదని షా పునరుద్ఘాటించారు. రాష్ట్రంలో పెరుగుతున్న అక్రమ చొరబాటుదారుల గురించి ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే అది తమ పొలిటికల్ అజెండా అని సీఎం హేమంత్ సోరెన్ విమర్శిస్తున్నారని అన్నారు. సోరెన్ వారిని కేవలం ఓటు బ్యాంకుగా మాత్రమే వాడుకుంటున్నారని దుయ్యబట్టారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com