PM Modi : విదేశాల్లో పెళ్లిళ్లు చేసుకోవటంపై ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు

PM Modi : విదేశాల్లో పెళ్లిళ్లు చేసుకోవటంపై ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు
వోకల్ ఫర్ లోకల్ నినాదానికి మోదీ ప్రచారం

ఆదివారం మన్‌ కీ బాత్‌లో ప్రసంగించిన ప్రధాని నరేంద్ర మోదీ.. విదేశీ వేదికలకు బదులుగా దేశంలోనే డెస్టినేషన్ వెడ్డింగ్‌లను చేసుకోవాలని సూచించారు. దీని వల్ల దేశంలో అత్యాధునిక మౌలిక సదుపాయాల అభివృద్ధికి దోహదం చేస్తుందని, ఉద్యోగ కల్పనకు దారితీస్తుందని అన్నారు. ‘పెళ్లి అనే అంశం తెరపైకి వచ్చినప్పటి నుంచి ఒక విషయం నన్ను చాలా కాలంగా ఇబ్బంది పెడుతోంది… నేను నా హృదయంలో బాధను కుటుంబసభ్యులకు (దేశ పౌరులు) తప్ప ఎవరితో చెప్పగలను.. ఒక్కసారి ఆలోచించండి.. ఈ రోజుల్లో కొన్ని కుటుంబాలు విదేశాలకు వెళ్లి పెళ్లిళ్లు చేసుకునే కొత్త వాతావరణాన్ని సృష్టిస్తున్నాయి.. ఇది అస్సలు అవసరమా? భారత గడ్డపై భారతీయుల మధ్య వివాహాల వేడుకలు జరుపుకుంటే దేశ సంపద దేశంలోనే ఉంటుంది’ అని మోదీ పేర్కొన్నారు.

దేశంలోని డబ్బు దేశంలోనే ఉండేలా భారత్ గడ్డపై వివాహాలు వంటి వేడుకలు జరుపుకోవాలని ఈ సందర్భంగా ఆయన కోరారు. అలాగే వేడుకల కోసం చేసే షాపింగ్ లో భారత్ లో తయారైన ఉత్తత్పులు వాడేలా ప్రాధాన్యత ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. పెళ్లిళ్లు సీజన్ మొదలు కావటంతో ప్రధాని మన్ కీ బాత్ లో ఈ అంశాలను ప్రస్తావించారు. భారతీయులు భారత్ లోనే వివాహాలు వంటి వేడుకలు చేసుకుంటే దేశ సంపద విదేశాలకు వెళ్లకుండా దేశంలోనే ఉంటుందని అన్నారు. ఇలా చేస్తే మన డబ్బు మన వద్దే ఉంటుందని ప్రధాని ఆకాంక్షించారు.


‘స్వచ్ఛ్ భారత్ మిషన్ విజయం ‘వోకల్ ఫర్ లోకల్’ ప్రచారానికి స్ఫూర్తినిచ్చింది.. ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయడంతో పాటు ఉపాధికి హామీ ఇస్తూ అభివృద్ధి చెందిన, సుసంపన్నమైన భారతదేశానికి ఇది ద్వారాలు తెరుస్తోంది.. ఇది పట్టణ, గ్రామీణ ప్రజలకు సమాన అవకాశాలను అందిస్తుంది. స్థానిక ఉత్పత్తుల విలువ జోడింపునకు కూడా మార్గం సుగమం చేస్తుంది.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో హెచ్చు తగ్గులు ఉంటే, లోకల్ కోసం వోకల్ అనే మం త్రం మన ఆర్థిక వ్యవస్థను కూడా రక్షిస్తుంది’ అని మోదీ అన్నారు.

దేశ నిర్మాణ బాధ్యతలను ప్రజలు తీసుకున్నప్పుడు..ఆ దేశాన్ని ముందుకు సాగకుండా ప్రపంచంలోని ఏ శక్తి కూడా ఆపలేదని ప్రధాని మోదీ పేర్కొన్నారు. భారత్ లో 140 కోట్ల మంది ప్రజలు అనేక పరివర్తనలకు నాయకత్వం వహిస్తున్నారు..అది ప్రస్తుతం దేశంలో స్పష్టంగా కనిపిస్తోంది అని ఈ సందర్బంగా ఆయన అన్నారు. దేశంలో పండుగలు వంటివి వస్తే వ్యాపారం విస్తారంగా జరుగుతోంది. ఇది ప్రత్యక్షంగా కనిపిస్తోంది. దీపావళి, భయ్యా దూజ్, ఛత్ వేడుల సమయంలో దేశంలో కోటి రూపాయల వ్యాపారం జరిగిందని తాము గుర్తించామన్నారు. ప్రస్తుత కాలంలో ప్రజలు మేడ్ ఇన్ ఇండియా ఉత్పత్తులను కొనుగోలు చేయడంలో ఉత్సాహం చూపిస్తున్నారని దానిని మరింతగా ప్రోత్సహించాల్సిన అవసరం ఉందన్నారు.

Tags

Read MoreRead Less
Next Story