WEST BENGAL: బెంగాల్ "సర్" సమరం... రంగంలోకి జ్యుడీషియల్ ఆఫీసర్లు

పశ్చిమ బెంగాల్లో ఎన్నికల నగారా మోగకముందే ఓటర్ల జాబితా ప్రక్షాళన వ్యవహారం పతాక స్థాయికి చేరింది. సుప్రీంకోర్టు అత్యున్నత ఆదేశాల నేపథ్యంలో, రాష్ట్రవ్యాప్తంగా పెండింగ్లో ఉన్న సుమారు 45 లక్షల వివాదాస్పద ఓటర్ల సవరణ కేసులను పరిష్కరించేందుకు ఏకంగా 250 మంది జ్యుడీషియల్ అధికారులను రంగంలోకి దించారు. సోమవారం నుంచే వీరంతా క్షేత్రస్థాయిలో విధులను ప్రారంభించారు. ఈ ప్రక్రియను అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్న కలకత్తా హైకోర్టు, సదరు న్యాయాధికారుల సెలవులన్నీ రద్దు చేస్తూ సంచలన ఆదేశాలు జారీ చేసింది. ఇప్పటికే సెలవులో ఉన్న వారు కూడా తక్షణమే కోర్టుకు నివేదించాలని, వైద్య అత్యవసర పరిస్థితులు మినహా మరే ఇతర కారణాలనూ పరిగణనలోకి తీసుకోబోమని స్పష్టం చేస్తూ జారీ చేసిన నోటీసు ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశమైంది.
ఓటరు జాబితా సవరణ ప్రక్రియను గడువులోగా పూర్తి చేసేందుకు న్యాయవ్యవస్థ తన శక్తినంతటినీ ధారపోస్తోంది. ఈ ప్రక్రియ సజావుగా సాగేందుకు వీలుగా న్యాయస్థానాల్లో ఉన్న సాధారణ, అత్యవసర కేసుల విచారణను ఇతర బెంచ్లకు మళ్లించారు. మార్చి 9 వరకు ఈ అధికారులు కేవలం ఓటర్ల జాబితా సవరణ సంబంధిత వివాదాలపైనే తుది తీర్పులు వెలువరించనున్నారు. ఆదివారం నాడే జిల్లా జడ్జిలు, కలెక్టర్లు, పోలీస్ అధికారులతో ప్రత్యేకంగా సమావేశమై ఈ లక్షలాది వివాదాలను ఎలా పరిష్కరించాలనే దానిపై పక్కా ప్రణాళికను రూపొందించారు. ఫిబ్రవరి 28వ తేదీ నాటికి తుది ఓటర్ల జాబితాను ప్రచురించాల్సి ఉన్న తరుణంలో, ఈ పెండింగ్ కేసుల పరిష్కారం ప్రాముఖ్యత సంతరించుకుంది. గడువులోగా ప్రక్రియ పూర్తి కాకుంటే, క్లియర్ అయిన పేర్లను ప్రచురించి మిగిలిన వారిని అనుబంధ జాబితాలో చేర్చవచ్చని ఈసీ ఇచ్చిన సూచనకు సుప్రీంకోర్టు ఆమోదం తెలిపింది. ప్రధాన ఎన్నికల అధికారి మనోజ్ కుమార్ అగర్వాల్ వెల్లడించిన వివరాల ప్రకారం, గత విచారణలకు భారీ సంఖ్యలో ప్రజలు గైర్హాజరు కావడం అధికారులను ఇబ్బందుల్లో నెట్టింది. ఫిబ్రవరి 14 వరకు జరిగిన విచారణల్లో సుమారు 4.98 లక్షల మంది తమ వాదనలు వినిపించడానికి రాలేదు.
తప్పుడు సమాచారం లేదా ఇతర లోపాల వల్ల 1.63 లక్షల మందిని ఓటు హక్కుకు అనర్హులుగా ప్రకటించారు. అంతకుముందు ప్రచురించిన ముసాయిదా జాబితాలోనే చనిపోయిన వారు, వలస వెళ్ళిన వారు సుమారు 58 లక్షల మందిని తొలగించారు. ఇప్పుడు జ్యుడీషియల్ అధికారుల నేతృత్వంలో సాగుతున్న ఈ చివరి అంకం అత్యంత పకడ్బందీగా ఉండబోతోంది. ఓటు హక్కు విషయంలో ఎలాంటి అక్రమాలకు తావు లేకుండా, ప్రతి అర్హుడికి న్యాయం జరిగేలా యంత్రాంగం కట్టుదిట్టమైన చర్యలు చేపడుతోంది.
జాబితా సవరణ ఒకవైపు జరుగుతుండగానే, బెంగాల్ భూభాగంపై కేంద్ర బలగాల కవాతు మొదలైంది. కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు భారీ సంఖ్యలో కేంద్ర సాయుధ పోలీసు బలగాలు (CAPF) సోమవారం నాడే రాష్ట్రానికి చేరుకున్నాయి. ఎన్నికల ప్రక్రియ ప్రారంభానికి ముందే ఓటర్లలో ఆత్మవిశ్వాసం పెంచేందుకు (Confidence Building Measure) ఈ బలగాలను మోహరిస్తున్నారు. కేంద్ర బలగాల ఉన్నతాధికారులు రాష్ట్ర ఎన్నికల సంఘం, పోలీసు అధికారులతో సమావేశమై శాంతిభద్రతల పరిస్థితిని సమీక్షించారు. రాష్ట్రంలోని సున్నిత ప్రాంతాలను గుర్తించేందుకు ప్రత్యేక బ్లూప్రింట్ సిద్ధం చేస్తున్నారు. క్షేత్రస్థాయిలో పరిస్థితుల తీవ్రతను బట్టి మరిన్ని అదనపు బలగాలను రంగంలోకి దించేందుకు కూడా ఎన్నికల సంఘం సిద్ధంగా ఉందని అధికారిక వర్గాలు పేర్కొంటున్నాయి.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com
