West Bengal: సీఎం మమతా బెనర్జీకి గాయాలు

West Bengal: సీఎం మమతా బెనర్జీకి గాయాలు
పెను ప్రమాదం నుంచి బయటపడ్డ మమతా బెనర్జీ... మమతా ప్రయాణిస్తున్న హెలికాప్టర్‌ అత్యవసర ల్యాండింగ్‌... మమత నడుము, కాళ్లకు గాయాలు

పశ్చిమబెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ మంగళవారం పెను ప్రమాదం నుంచి బయటపడ్డారు. ఆమె ప్రయాణం చేస్తున్న హెలికాప్టర్‌ బాగ్‌డోగ్రా ఎయిర్‌బేస్‌లో ఎమర్జెన్సీ ల్యాండింగ్‌ అయ్యింది. ప్రతికూల వాతావరణం కారణంగా హెలికాప్టర్‌ తీవ్ర కుదుపులకు లోనైంది. దీంతో ఆమెతోపాటు ఉన్న అధికారులు, ఇతర సిబ్బంది తీవ్ర ఆందోళనకు గురయ్యారు. ఎమర్జెన్సీ ల్యాండింగ్‌ సమయంలో మమత గాయపడ్డారు. హెలికాప్టర్‌ నుంచి కిందకు దిగుతుండగా మమతా బెనర్జీ నడుము, కాళ్లకు గాయాలయ్యాయి. ఆమె అక్కడ నుంచి రోడ్డు మార్గంలో బాగ్‌డోగ్రా ఎయిర్‌పోర్టుకు చేరి విమానంలో కోల్‌కతా చేరుకున్నారు.


విమానాశ్రయం నుంచి నేరుగా ఆమెను ప్రభుత్వ ఆధ్వర్యంలో నడిచే ఎస్‌ఎస్‌కేఎం ఆసుపత్రికి తరలించారు. అక్కడ పలువురు నిపుణులైన డాక్టర్లు ముఖ్యమంత్రి గాయాలను పరిశీలించారు. ఎంఆర్‌ఐ పరీక్ష నిర్వహించారు. అందులో ఎడమ మోకీలు, తుంటికి సంబంధించిన లిగ్‌మెంట్‌ గాయాలైనట్లు గుర్తించారు. వాటికి చికిత్స చేసి ఆసుపత్రిలో వైద్యం చేయించుకోవాలని సీఎం మమతకు వైద్యులు సూచించారు. అయితే తాను ఇంటి వద్దనే చికిత్స తీసుకుంటానని రాత్రి 9 గంటల సమయంలో ఆసుపత్రి నుంచి వెళ్లిపోయారు.


మమత గాయపడ్డారని తెలుసుకుని రాష్ట్ర గవర్నర్‌ సీవీ ఆనంద్‌ బోస్‌ ఆమెకు ఫోన్‌ చేశారు. క్షేమ సమాచారం అడిగి తెలుసుకున్నారు. నడవడానికి మమతా కాస్త ఇబ్బంది పడుతున్నట్లుగా కనిపిస్తున్న దృశ్యాలు సోషల్ మీడియాలో కనిపించాయి. డార్జిలింగ్‌ జిల్లా జల్పాయిగురిలో పంచాయతీ ఎన్నికల సభలో పాల్గొన్న మమతా బెనర్జీ, తిరిగి హెలికాప్టర్‌లో బాగ్డోగ్రా ఎయిర్‌పోర్ట్‌కు వెళ్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. కుదుపునకు గురైన సమయానికి హెలికాప్టర్‌ బైకుంఠ్‌పుర్‌ అటవీ ప్రాంతం పై నుంచి భారీ వర్షంలో బాగ్‌డోగ్రా విమానాశ్రయం దిశగా ప్రయాణిస్తోంది. పరిస్థితిని గుర్తించిన పైలట్‌ చాకచక్యంగా వ్యవహరించి హెలికాప్టర్‌ను శిలిగుడి సమీపంలోని సెవోక్‌ ఎయిర్‌బేస్‌లో అత్యవసరంగా దించేశారు.

Tags

Read MoreRead Less
Next Story