West Bengal : బెంగాల్‌లో వక్ఫ్ నిరసనలు ఉధృతం

బెంగాల్‌లో ఉద్రిక్తతలు కొనసాగుతూనే ఉన్నాయి. భారీగా ముస్లింలు రోడ్లపైకి వచ్చి నిరసనలు తెలుపుతున్నారు. వక్ఫ్ చట్టాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. దక్షిణ 24 పరగణాలులో పెద్ద ఎత్తున ముస్లింలు రోడ్లపైకి వచ్చి నిరసనలు తెలుపుతున్నారు. దీంతో భారీగా బలగాలు మోహరించారు. అల్లర్లు జరగకుండా కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు.
అయినా కూడా పోలీస్ మోటర్ బైకులకు నిప్పుపెట్టారు. బస్సు అద్దాలు ధ్వంసం చేశారు. పలు వాహనాలు బోల్తా పడ్డాయి. భంగర్ ప్రాంతంలో ఇండియన్ సెక్యులర్ ఫ్రంట్ మద్దతుదారులు పోలీసులతో ఘర్షణ దిగడంతో హింస చెలరేగింది. దీంతో పోలీస్ వాహనాలను తగలబెట్టారు. ఇదిలా ఉంటే ఘర్షణలో పలువురు పోలీసులు గాయపడినట్లు సమాచారం. ఇక నిరసనకారులను చెదరగొట్టేందుకు లాఠీఛార్జ్ చేశారు. ఈ ఘటనలో ఒకరు గాయపడినట్లు తెలుస్తోంది.
గత కొద్దిరోజులుగా బెంగాల్ నిరసనలతో అట్టుడుకుతోంది. ఎక్కువగా ముర్షిదాబాద్ జిల్లాలో తీవ్ర ఉద్రిక్తతలు నెలకొన్నాయి. రైల్వే ఆస్తులు ధ్వంసం, పోలీస్ వాహనాలకు నిప్పుపెట్టడం ఇలా అనేక ఘటనలు చోటుచేసుకున్నాయి. దీంతో పోలీసులు.. లాఠీలకు పని చెప్పాల్సిన పరిస్థితి ఏర్పడింది. నిరసనకారులపై లాఠీఛార్జ్ చేశారు. అయినా కూడా పరిస్థితులు సద్దుమణగ లేదు. ఎక్కడో చోట ఘర్షణలు జరుగుతూనే ఉన్నాయి.
ఇదిలా ఉంటే వక్ఫ్ చట్టాన్ని అమలు చేయమని ఇప్పటికే ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ప్రకటించారు. విభజన రాజకీయాలను ఎట్టి పరిస్థితుల్లో అంగీకరించమని తెలిపారు. అయినా కూడా అల్లర్లు ఆగలేదు. పెద్ద ఎత్తున నిరసనలు చోటుచేసుకుని హింస చెలరేగింది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com