భారత్ రెజ్లింగ్ సమాఖ్య ఎన్నికల ప్రక్రియ షురూ

భారత్ రెజ్లింగ్ సమాఖ్య ఎన్నికల ప్రక్రియ షురూ
జులై 4 న ఎన్నికలు నిర్వహించేందుకు సిద్ధమైన ఐఓఏ

రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ఎన్నికల ప్రక్రియకు భారత ఒలింపిక్‌ సంఘం శ్రీకారం చుట్టింది. జులై 4న నిర్వహించనున్న ఈ ఎలక్షన్ కు జమ్మూ కశ్మీర్‌ హైకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి మహేశ్‌ మిట్టల్‌ కుమార్‌ను రిటర్నింగ్‌ అధికారి గా నియమించింది. అయితే రెజ్లింగ్‌ సమాఖ్య ప్రత్యేక సాధారణ సమావేశంతోపాటు ఎన్నికల నిర్వహణ తేదీని జస్టిస్‌ మిట్టల్‌ స్వయంగా నిర్ణయిస్తారని ఐఓఏ వర్గాలు వెల్లడించాయి.

డబ్ల్యూఎఫ్‌ఐ మాజీ అధ్యక్షుడు బ్రిజ్‌భూషణ్‌ శరణ్ సింగ్‌పై.. రెజ్లర్ల లైంగిక ఆరోపణలతో రంగంలోకి దిగిన ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్, డబ్ల్యూఎఫ్‌ఐ ప్యానెల్‌ను రద్దు చేసింది. కార్యకలాపాల నిర్వహణను అడ్‌హక్‌ కమిటీకి అప్పగించింది. డబ్ల్యూ ఎఫ్ ఐ ముందుగా మే 7వ తేదీన ఎన్నికలు నిర్వహిస్తామని ప్రకటించింది అయితే వివాదాల కారణంగా భారత క్రీడ మంత్రిత్వ శాఖ ఆ నిర్ణయాన్ని నిరాకరించింది. ఎన్నికలను నిర్వహించడానికి ఇద్దరు సభ్యుల తాత్కాలిక కమిటీని నియమించి నూతనంగా ఎన్నికల ప్రక్రియను స్టార్ట్ చేసింది. 45 రోజుల్లోగా డబ్ల్యూఎఫ్‌ఐ ఎన్నికలు పూర్తయి కొత్త ప్యానెల్ ఏర్పడుతుందని అడ్‌హక్‌ కమిటీకి తెలిపింది.

మరోవైపు లైంగిక ఆరోపణలు ఎదుర్కొంటున్న డబ్యూఎఫ్ఐ మాజీ అధ్యక్షుడు బ్రిజ్‌భూషణ్‌పై ఢిల్లీ పోలీసులు ప్రస్తుతం దర్యాప్తు చేస్తున్నారు. ఈ కేసుకు సంబంధించిన నివేదికను. ఢిల్లీ ట్రయల్‌ కోర్టుకు గురువారంలోగా ఢిల్లీ పోలీసులు అందించాల్సి ఉంది. ఇదిలా ఉండగా బ్రిజ్ భూషణ్‌ను అరెస్ట్ చేయాలని రెజ్లర్లు డిమాండ్ చేస్తున్నారు. తమకు న్యాయం జరిగే వరకు పోరాటం ఆపేది లేదని రెజ్లర్లు తేల్చి చెప్పారు. లైంగిక వేధింపుల కేసులో బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్‌పై చర్యలు తీసుకోకపోతే.. ఈ ఏడాది జరిగే ఏషియన్ గేమ్స్‌ను బాయ్‌కాట్ చేస్తామని స్పష్టం చేశారు. సమస్యల పరిష్కారానికి జూన్ 15 వరకు కేంద్రమంత్రి అనురాగ్ ఠాకూర్ సమయం ఇచ్చారని.. తర్వాత ఏం చేయాలన్న దానిపై భవిష్యత్ కార్యాచరణ రూపొందిస్తామని చెప్పారు.

Tags

Read MoreRead Less
Next Story