G20 summit : భారత మండపాన్ని చూద్దాం రండి..

G20 summit : భారత మండపాన్ని చూద్దాం రండి..
దేశంలోనే అతిపెద్ద కన్వెన్షన్ సెంటర్ గా భరత్ మండపం

దేశ రాజధాని దిల్లీలో కొత్తగా ప్రారంభించిన భారత్‌ మండపం జీ 20 శిఖరాగ్ర సదస్సుకు ఆతిథ్యం ఇచ్చేందుకు ముస్తాబయింది. ఈనెల 9, 10 తేదీల్లో జరగనున్ జీ 20 దేశాల అధినేతల సమావేశానికి ఈ భారత్‌ మండపమే వేదిక కానుంది. సకల ఆధునిక సౌకర్యాలతో కూడిన భారత్ మండపం ప్రపంచంలోనే అతిపెద్ద కేంద్రంగా నిలవబోతోంది.

ఢిల్లీ‌లో సెప్టెంబర్ 9, 10 తేదీల్లో G2o సమ్మిట్‌ జరగనున్న సంగతి తెలిసిందే. అగ్రశ్రేణి ప్రపంచ నాయకులు పాల్గొనే శిఖరాగ్ర సమావేశానికి వేదికగా ప్రగతి మైదాన్‌లోని భారత్ మండపం, ఇంటర్నేషనల్ ఎగ్జిబిషన్-కన్వెన్షన్ సెంటర్ ఆతిథ్యం ఇవ్వనున్నాయి. కొత్త ఎగ్జిబిషన్-కమ్-కన్వెన్షన్ సెంటర్ (IECC)ని ప్రధాని నరేంద్ర మోదీ జూలైలో జాతికి అంకితం చేశారు.ఇక భారత సాంస్కృతిక వైభవాన్ని ప్రతిబింబించేలా జీ20 శిఖరాగ్ర సదస్సు ప్రాంగణాన్ని కేంద్ర సాంస్కృతిక శాఖ ముస్తాబు చేసింది. ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన 8 లోహాలతో తయారు చేసిన అష్టధాతు నటరాజ విగ్రహం ఈ వేదిక ముందు కొలువుదీరింది. దిల్లీలోని ప్రగతి మైదాన్‌లో సకల హంగులతో ఆధునిక వసతులతో ఏర్పాటు చేసిన భారత మండపం విద్యుద్దీపాల కాంతుల్లో వెలుగులీనుతోంది. ఎటుచూసినా మిరుమిట్లుగొలిపే కాంతులతో భారత సాంస్కృతిక వైభవాన్ని విశ్వానికి చాటిచెప్పేలా సిద్ధమైంది.


ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన 8 లోహాలతో తయారు చేసిన అష్టధాతు నటరాజ విగ్రహం ఇదే. వెండి, బంగారం, జింకు, రాగి, సీసం, తగరం, పాదరసం, ఇనుము పదార్థాల మిశ్రమంతో తయారైన విగ్రహాలను అష్ట ధాతు విగ్రహాలంటారు. చోళుల కాలం నాటి మైనపు కాస్టింగ్‌ అనే శిల్ప పద్ధతిని ఉపయోగించి దీనిని నిర్మించారు. అంటే ఎక్కడా కూడా అతుకులు లేకుండా విగ్రహాన్ని రూపొందించారు.


భారత్‌ మండపంలోని సమావేశ గది, లాంజ్, ఆడిటోరియం, యాంఫీ థియేటర్, వ్యాపార కేంద్రాలు ప్రపంచ దేశాధినేతలకు ఆహ్వానం పలికేందుకు సిద్ధమయ్యాయి. దేశ సంస్కృతి ఉట్టిపడేలా భారత మండపాన్ని రూపకల్పన చేసిన విధానం చూపరులను కట్టిపడేస్తోంది. భారత్ మండపంలో 5-G వైఫై క్యాంపస్, 16 భాషలను అనువదించే సదుపాయం, వీడియో వాల్, బిల్డింగ్ మేనేజ్‌మెంట్ సిస్టమ్, లైట్ మేనేజ్‌మెంట్ సిస్టమ్, డేటా కమ్యూనికేషన్ సెంటర్ వంటి అధునాతన సాంకేతిక సౌకర్యాలతో భారత్‌ మండపం సర్వంగా సుందరంగా ముస్తాబైంది.

Tags

Read MoreRead Less
Next Story