Gaganyaan: అంతరిక్షంలోకి మానవులను తీసుకెళ్లే మిషన్‌లో తొలి అడుగు

భారత వ్యోమగాములను అంతరిక్షంలోకి పంపేందుకు ప్రతిష్టాత్మకంగా చేపట్టినది గగన్‌యాన్ మిషన్. ఇందులోని కీలకమైన క్రూ ఎస్కేప్ వ్యవస్థ పనితీరుని ప్రదర్శించే తొలి టెస్ట్ వెహికిల్ అబార్ట్ మిషన్-1 (టీవీ-డీ1) పరీక్షకు ఇస్రో సర్వం సిద్ధం చేసింది. అనుకోని సమస్య ఎదురైతే వ్యోమగాములు సురక్షితంగా బయటపడేలా చూసే లక్ష్యంతో ఈ పరీక్షను చేపడుతున్నారు. ఆంధ్రప్రదేశ్ శ్రీహరికోటలోని స్పేస్ సెంటర్లో శనివారం ఉదయం 8 గంటలకు ఫ్లైట్ టెస్ట్ వెహికిల్ అబార్ట్ మిషన్-1 స్పేస్‌క్రాఫ్ట్ పరీక్ష చేయనున్నారు. ఈ ప్రయోగం పూర్తి కావడానికి మొత్తం 8.5 నిమిషాల వ్యవధి పడుతుంది. ఇందుకు సంబంధించిన ముందస్తు ప్రక్రియను ఇప్పటికే పూర్తి చేసినట్లు ఇస్రో తెలిపింది.
చంద్రయాన్ 3, ఆదిత్య ఎల్ 1ల సక్సెస్‌తో భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రో మంచి ఊపులో వుంది. ఎప్పుడు ఏం చేస్తుందోనని ప్రపంచం ఆసక్తిగా గమనిస్తోంది. ఒకప్పుడు మనల్ని అవమానించిన వారే ఇప్పుడు మన టెక్ సపోర్ట్ కోసం బతిమలాడుకుంటున్నారు. చంద్రయాన్ 3 అనుభవాలను తమతో పంచుకోవాల్సిందిగా స్వయంగా అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థ (నాసా)నే అడిగిందంటే స్పేస్‌లో ఇస్రో స్థాయి ఎక్కడికి చేరుకుందో అర్ధం చేసుకోవచ్చు.
మానవ సహిత గగన్‌యాన్ ప్రయోగ సన్నాహాల్లో భాగంగా మానవ రహితంగా ఇస్రో చేపడుతున్న కీలక ప్రయోగమే ఈ క్రూ ఎస్కేప్ దీనికి సంబంధించి 13 గంటల కౌంట్‌డౌన్ శుక్రవారం రాత్రి 7 గంటలకు మొదలైంది. అది పూర్తవగానే శనివారం ఉదయం 8 గంటలకు క్రూమాడ్యూల్‌తో కూడిన సింగిల్ స్టేజ్ లిక్విడ్ ప్రొపల్షన్ రాకెట్ నింగిలోకి దూసుకెళ్లనుంది. ప్రయోగ నేపథ్యంలో ఇస్రో చైర్మన్ సోమనాథ్ శుక్రవారమే షార్‌కు చేరుకున్నారు. టీవీ-డీ1 రాకెట్ భూమి నుంచి నిర్దేశిత ఎత్తుకు చేరిన తర్వాత క్రూ మాడ్యూల్ విడిపోనుంది. అక్కడినుంచి అందులో అమర్చిన పారాచూట్ల సాయంతో నెమ్మదిగా దాన్ని సముద్రంలోకి దింపుతారు.
ఫ్లైట్ టెస్ట్ వెహికిల్ అబార్ట్ మిషన్-1 స్పేస్‌క్రాఫ్ట్ క్రూ మాడ్యూల్ తో పాటు క్రూ ఎస్కేప్ సిస్టమ్‌ను 17 కిలో మీటర్ల ఎత్తువరకు మోసుకెళ్లాక అబార్ట్ సిగ్నల్‌ను పంపిస్తారు. ఎస్కేప్ సిస్టమ్ సమర్థంగా పనిచేస్తే క్రూ మాడ్యూల్ విడిపోయి, పారాచూట్ సాయంతో సముద్రంలో పడిపోతుంది. అనంతరం దాన్ని నేవీ సిబ్బంది బయటకు తీసుకొస్తారు.
2025లో ప్రారంభించాలని భావిస్తున్న గగన్‌యాన్ .. 3 రోజుల మిషన్ కోసం 400 మీటర్ల కక్ష్యలోకి ముగ్గురు వ్యోమగాములను తీసుకెళ్లి .. తిరిగి వారిని భారత జలాల్లో ల్యాండ్ చేయడం ద్వారా వారిని సురక్షితంగా భూమికి తీసుకురావాలని ఇస్రో లక్ష్యంగా పెట్టుకుంది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com