Friedrich Merz: జర్మనీ ఎన్నికల్లో గెలిచిన ఫ్రెడరిక్ మెర్జ్

జర్మనీ పార్లమెంటు ఎన్నికల్లో అనూహ్య ఫలితం వచ్చింది. ప్రతిపక్ష నేత ఫ్రెడ్రిక్ మెర్జ్‌కు చెందిన క్రిస్టియన్ డెమోక్రటిక్ యూనియన్ (సీడీయూ), క్రిస్టియన్ సోషల్ యూనియన్ (సీఎస్‌యూ) పార్టీల కూటమి ఘన విజయం సాధించింది. ప్రస్తుతం జర్మనీ ఛాన్సలర్ ఒలాఫ్ షోల్జ్‌నకు చెందిన సోషల్ డెమొక్రటిక్ పార్టీ(ఎస్‌డీపీ) ఘోర పరాజయాన్ని చవిచూసింది. ఎన్నడూ లేనంత పేలవ ప్రదర్శనతో మూడో స్థానానికి పరిమితం అయ్యింది. దీంతో క్రిస్టియన్ డెమోక్రటిక్ యూనియన్‌కు సారథ్యం వహిస్తున్న 69 ఏళ్ల ఫ్రెడ్రిక్ మెర్జ్ జర్మనీకి నూతన ఛాన్సలర్ కానున్నారు. త్వరలోనే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని మెర్జ్ చెప్పారు. ‘‘ఏప్రిల్ 20న ఈస్టర్ పండుగ జరగబోతుంది. అప్పటికల్లా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాం. అమెరికా, రష్యా నుంచి ఎదురవుతున్న సవాళ్లను ఎదుర్కొనేలా ఐరోపా ఖండాన్ని ఏకం చేయడానికే తొలి ప్రాధాన్యం ఇస్తా. ఇటీవలే జర్మనీ ఎన్నికల్లో ఎలాన్ మస్క్ వచ్చి ప్రచారం చేశారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ బహిరంగంగా జర్మనీ రాజకీయ పార్టీ ఆల్టర్నేటివ్ ఫర్ జర్మనీకి మద్దతు ప్రకటించారు’’ అని వెల్లడించారు.
అధికార కూటమికి ఘోర ఓటమి
జర్మనీ పార్లమెంటులోని దిగువ సభ ‘బుందెస్టాగ్’లో మొత్తం 630 స్థానాలు ఉండగా, వాటిలో 208 సీట్లను ఫ్రెడ్రిక్ మెర్జ్ సారథ్యంలోని కన్జర్వేటివ్ పార్టీల కూటమి కైవసం చేసుకుంది. అలైస్ వీడెల్ సారథ్యంలోని ఆల్టర్నేటివ్ ఫర్ జర్మనీ (ఏఎఫ్‌డీ) పార్టీకి 152 సీట్లు వచ్చాయి. ప్రస్తుతం అధికారంలో ఉన్న కూటమి ప్రభుత్వంలోని మూడు పార్టీలు కూడా పెద్దసంఖ్యలో సిట్టింగ్ స్థానాలను కోల్పోయాయి. ఛాన్సలర్ ఓలఫ్ షోల్జ్‌కు చెందిన సోషల్ డెమోక్రటిక్ పార్టీ (ఎస్‌డీపీ) 120 సీట్లతో మూడో స్థానానికి పరిమితమైంది. రెండో ప్రపంచ యుద్ధం తర్వాత ఎన్నడూ లేనంత ఘోర ఓటమిని చవి చూసింది. గ్రీన్స్ పార్టీ 85 స్థానాలతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. వామపక్ష ‘ది లెఫ్ట్’ పార్టీ 64 సీట్లు సాధించింది. వామపక్ష భావజాలం కలిగిన సహ్రా వాంగెన్ నెచ్ కూటమికి ఒక్క సీటు కూడా రాలేదు. ఇతరులకు ఒక స్థానం దక్కింది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com