Delhi: ఢిల్లీ ముఖ్యమంత్రి ఎవరు?

27 ఏండ్ల సుదీర్ఘ నిరీక్షణకు తెరదించుతూ దేశ రాజధాని ఢిల్లీలో బీజేపీ అత్యధిక సీట్లు గెలిచి అధికారాన్ని కైవసం చేసుకున్నది. దీంతో తదుపరి సీఎం ఎవరనే దానిపై ఇప్పుడు చర్చ జోరందుకున్నది. కమలం పార్టీ అధికారికంగా సీఎం పేరు ప్రకటించనప్పటికీ, ఈ రేసులో ముందంజలో ఉన్న పలువురి పేర్లు ఇప్పటికే రాజకీయ వర్గాల్లో చక్కర్లు కొడుతున్నాయి.
పర్వేశ్ వర్మ: ఈయన ఢిల్లీ మాజీ సీఎం సాహిబ్ సింగ్ వర్మ కుమారుడు. అత్యంత ప్రతిష్టాత్మకమైన న్యూఢిల్లీ అసెంబ్లీ నియోజకవర్గంలో మాజీ సీఎం, ఆప్ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్‌పై వర్మ గెలుపొందడం విశేషం. ఇది ఆయనకు కలిసొచ్చే అంశం. 2014 నుంచి 2024 వరకు ఆయన పశ్చిమ దిల్లీ నుంచి లోక్‌సభ సభ్యుడిగా కొనసాగారు. అసెంబ్లీ ఎన్నికల్లో కేజ్రీవాల్‌కు దీటైన అభ్యర్థి కోసం భారీ కసరత్తు చేసిన భాజపా చివరకు వర్మను రంగంలోకి దించింది. పార్టీ నమ్మకాన్ని పర్వేశ్ వర్మ నిలబెట్టుకున్నారు.
రమేశ్ బిధూరి: ఈయన మాజీ ఎంపీ. గుజ్జర్ సామాజికవర్గానికి చెందిన ముఖ్య నాయకుడు. ఢిల్లీ సీఎం ఆతిశీపై పోటీ చేశారు. రమేశ్ ఢిల్లీ బీజేపీలో కీలక నాయకుడిగా కొనసాగుతున్నారు.
బన్సూరి స్వరాజ్: విదేశీ వ్యవహారాల మాజీ మంత్రి, దివంగత సుష్మా స్వరాజ్ కుమార్తె బన్సూరి స్వరాజ్. న్యూఢిల్లీ నుంచి మొదటిసారి ఎంపీగా ఎన్నికయ్యారు. అతి తక్కువ కాలంలోనే ఢిల్లీ బీజేపీలో గుర్తింపు పొందారు.
స్మృతి ఇరానీ: ఒకప్పటి బీజేపీ ముఖ్య లీడర్లలో స్మృతి ఇరానీ ఒకరు. కానీ, గత లోక్‌సభ ఎన్నికల్లో ఓడిన తర్వాత ఆమె తెరమరుగయ్యారు. ఇప్పుడు సీఎం రేసులో ఆమె కూడా ఉన్నట్టు సమాచారం.
ఢిల్లీ భాజపా మాజీ అధ్యక్షులైన విజేందర్ గుప్తా, సతీశ్ ఉపాధ్యాయ్ పేర్లూ సీఎం పదవికి వినిపిస్తున్నాయి. భాజపా దిల్లీ అధ్యక్షుడు వీరేంద్ర సచ్‌దేవ, జాతీయ కార్యదర్శి దుశ్యంత్ గౌతమ్, ఎంపీ మనోజ్ తివారీ, సీనియర్ నేతలు కపిల్ మిశ్ర, అర్వింద్ సింగ్ లవ్లీతో పాటు వ్యాపార వర్గానికి చెందిన జితేంద్ర మహాజన్ పేర్లు సీఎం రేసులో వినిపిస్తున్నాయి.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com