త్వరలో శశికళ విడుదల.. అన్నాడీఎంకేను హస్తగతం చేసుకుంటారా?

త్వరలో శశికళ విడుదల.. అన్నాడీఎంకేను హస్తగతం చేసుకుంటారా?
జయలలిత నెచ్చెలి. జయ అమ్మ అయితే శశికళ చిన్నమ్మ. జయలలిత ప్రభుత్వాన్ని నడిపితే శశికళ పార్టీని నడిపించింది. కనుసైగలతోనే పార్టీని శాసించింది. జయ మరణంతో..

జయలలిత నెచ్చెలి. జయ అమ్మ అయితే శశికళ చిన్నమ్మ. జయలలిత ప్రభుత్వాన్ని నడిపితే శశికళ పార్టీని నడిపించింది. కనుసైగలతోనే పార్టీని శాసించింది. జయ మరణంతో పరిస్థితులన్నీ తలకిందులయ్యాయి. ఒక్క వారం గడిస్తే సీఎం పీఠంలో కూర్చునేది కాస్త జైలుకెళ్లింది. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో శిక్ష అనుభవిస్తోంది శశికళ. 2017 ఫిబ్రవరి నుంచి కర్నాటకలోని పరపన అగ్రహారం జైలులోనే ఉంది. ఇన్నేళ్లలో తక్కువ రోజులు పెరోల్‌పై బయటకు రావడం, సత్ప్రవర్తన కారణంగా ముందుగానే విడుదలవుతోంది శశికళ. అక్రమాస్తుల కేసులో జయలలితకు వంద కోట్లు, శశికళకు 10 కోట్ల జరిమానా విధించింది కోర్టు. ఆ 10 కోట్లను శశికళ కట్టేసింది. దీంతో జనవరి 27న జైలు నుంచి బయటకు రాబోతోందని తమిళనాడులో జోరుగా ప్రచారం సాగుతోంది.

శశికళ విడుదల కచ్చితంగా డీఎంకేకు సవాలే. కాని, అతిపెద్ద సవాలు ఎదుర్కోబోయేది అధికారంలో ఉన్న అన్నాడీఎంకేనే. చిన్నమ్మ రాక తరువాత పార్టీ అధికారంలో ఉంటుందా విచ్చిన్నం అవుతుందా అనేది సమాధానం లేని ప్రశ్నలే. అన్నాడీఎంకేలో ఇప్పటికీ చిన్నమ్మ అభిమానులు ఉన్నారు. చిన్నమ్మ తమిళనాడులో అడుగుపెట్టడమే ఆలస్యం.. భుజాన తువాలును నడుము కట్టుకుని వంగి వంగి దండం పెట్టే ఎమ్మెల్యేలు ఇప్పటికీ ఆ పార్టీలో ఉన్నారు. అసలు అన్నాడీఎంకేనే నాది అని శశికళ అన్నా అనొచ్చు. జైలుకు వెళ్లే ముందు జయ సమాధి మీద శపథం చేసింది కూడా అదే. ఇప్పటికైతే శశికళ మేనల్లుడు దినకరన్ ఓ పార్టీ పెట్టాడు. దాని పేరు అమ్మ మక్కల్ మున్నేట్ర కజగం. దీనికి ఫౌండర్ దినకరనే అయినా చిన్నమ్మ కనుసన్నల్లో నడుస్తున్న పార్టీ. జైల్లో ఉన్నప్పటికీ గత స్థానిక సంస్థల ఎన్నికల్లో వంద సీట్ల వరకు గెలిచిందీ చిన్నమ్మ పార్టీ. కాని, ఏఎంఎంకే పార్టీ కేవలం రాజకీయ ఉనికి కోసమే. శశికళ టార్గెట్ అన్నాడీఎంకేను చేజిక్కించుకోవడమే. జైలు నుంచి వచ్చీ రాగానే అన్నాడీఎంకేను చీల్చి అందులో తన బలం ఎంతో నిరూపించుకోవడమే. తాను అనుకున్నది జరిగితే ఏఎంఎంకే పార్టీని అన్నాడీఎంకేలో విలీనం చేస్తుంది. లేదంటే అన్నాడీఎంకేను విచ్ఛిన్నం చేసి అమ్మ మక్కల్ పార్టీని బలోపేతం చేసుకుంటుంది.

శశికళ విడుదలతో పన్నీరు సెల్వం, పళని స్వామి పరిస్థితి ఏమవుతుందనే చర్చ జరుగుతోంది. మొన్నటి వరకు గొడవలు పడిన వీరిద్దరూ సడెన్‌గా ఒక్కటయ్యారు. వచ్చే ఎన్నికల్లో సీఎం అభ్యర్ధిగా పళని స్వామి ఉంటారని అనౌన్స్ చేశారు కూడా. పైగా 11 మందితో మార్గదర్శక కమిటీ ఏర్పాటు చేశారు. శశికళకు అనుకూలంగా ఉన్నవారిని పొరపాటున కూడా ఈ కమిటీలో చేర్చుకోలేదు. శశికళకు పార్టీలో స్థానం ఇవ్వకుండా చేయడానికే ఇలా చేశారనేది ఓపెన్ టాక్. మొత్తానికి పళని, పన్నీరులకు సాంబారు కారేలా ఉంది. శశికళ బయట అడుగుపెట్టిందంటే ఇక పళని, పన్నీరులు ఉండరు. ఉన్నా వారి ప్రభావం నామమాత్రంగానే ఉంటుంది. అసలు పోటీ స్టాలిన్‌తోనే.

ఏదైమనా స్టాలిన్ బిందాస్‌గా ఉండొచ్చు. శశికళ రావాలి. తాను ఏం చేయబోతోందో చూడాలి. అన్నాడీఎంకేని హస్తగతం చేసుకుంటుందా, బయటికొచ్చి సొంత పార్టీని బలపరుచుకుంటుందా అనేది తేలాలి. ఇవన్నీ పార్టీ సంస్థాగత గొడవల కిందకే వస్తాయి. ఇవన్నీ సెట్ రైట్ అయితే తప్ప స్టాలిన్‌ను పట్టించుకునే పరిస్థితి లేదు. అప్పటి వరకు డీఎంకే అధినేత స్టాలిన్ తన పని తాను చేసుకోవచ్చు.

ఇక బీజేపీ ఉంది. తమిళనాడుపై బోలెడు ఆశలు పెట్టుకుంది. శశికళతో బీజేపీ జట్టుకట్టొచ్చని ఆ మధ్య వార్తలొచ్చాయి. లేదంటే చిన్నమ్మే బీజేపీ వైపు మొగ్గొచ్చు అని కూడా వినిపించింది. ఈమధ్యలో దినకరన్ చాలాసార్లు ఢిల్లీ వెళ్లి బీజేపీ పెద్దలను కలిసొచ్చారు కూడా. అసలే డీఎంకే బలపడుతోంది. ఈ పరిస్థితిలో అన్నాడీఎంకే బతికిబట్ట కట్టాలంటే శశికళే దిక్కని బీజేపీకి కూడా తెలిసొచ్చింది. అందుకు అనుగుణంగా శశికళ తలొగ్గితే సరి.. తల ఎగరేస్తానంటే మాత్రం బీజేపీ చూస్తూ ఊరుకోదు. ఇప్పటికే రజనీకాంత్‌ను రెడీగా పెట్టుకుంది. ఒకవేళ రజనీ రాజకీయాల్లోకి రాకపోతే.. మరో పార్టీని దించాలనుకుంటోంది. సో, బీజేపీకి స్టాలిన్ ఒక్కడే ప్రత్యర్థి అవుతాడా లేక శశికళను కూడా ఎదుర్కోవాలా అన్నది శశికళ బయటికొచ్చాక తేలిపోతుంది. కమల్ హాసన్, విజయ్ కాంత్ పార్టీలు నామమాత్రంగా కనిపిస్తున్నాయి. గత ఎన్నికల్లో ఓడిపోయిన తరువాత విజయ్ కాంత్ ఒక్కసారి కూడా బయటకు రాలేదు. తీవ్ర అనారోగ్యం కారణంగా కార్యకర్తలను కూడా కలవడం లేదు. సో, తమిళనాడు రాజకీయం శశికళ వర్సెస్ స్టాలిన్‌గానే నడవబోతోంది.

శశికళ టార్గెట్ సీఎం కుర్చీనే. ఎమ్మెల్యేగా పోటీచేసేందుకు శశికళకు అర్హత లేదు. అందుకే, శిక్ష విషయంలో సుప్రీంకోర్టులో కేవియేట్ పిటిషన్ వేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఎన్నికల్లో పోటీ చేసేందుకు తగిన వ్యూహాలను సిద్ధం చేసుకుంటోంది చిన్నమ్మ.

Tags

Read MoreRead Less
Next Story