తెలుగురాష్ట్రాల నదీజలాల సమస్య పరిష్కారం అవుతుందా?

తెలుగురాష్ట్రాల నదీజలాల సమస్య పరిష్కారం అవుతుందా?
తెలుగు రాష్ట్రాల్లో కృష్ణా, గోదావరి నదులపై నిర్మిస్తున్న ప్రాజెక్టుల విషయంలో ఇరు రాష్ట్రాలు వ్యక్తం చేస్తున్న అభ్యంతరాలపై చర్చించేందుకు కేంద్రం అపెక్స్‌ కౌన్సిల్ భేటీ ఏర్పాటు చేసింది..

తెలుగు రాష్ట్రాల్లో కృష్ణా, గోదావరి నదులపై నిర్మిస్తున్న ప్రాజెక్టుల విషయంలో ఇరు రాష్ట్రాలు వ్యక్తం చేస్తున్న అభ్యంతరాలపై చర్చించేందుకు కేంద్రం అపెక్స్‌ కౌన్సిల్ భేటీ ఏర్పాటు చేసింది. కరోనా నేపథ్యంలో ఈ సమావేశం ఇప్పటికే పలుమార్లు వాయిదా పడింది. ఢిల్లీ పర్యటనలో ఉన్న ఏపీ సీఎం జగన్.. ప్రధానితో భేటీ తర్వాత అపెక్స్‌ కౌన్సిల్‌ భేటీలో వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా పాల్గొంటారు. తెలంగాణ సీఎం కేసీఆర్‌ హైదరాబాద్‌ నుంచి తమ అధికారులతో కలిసి సమావేశంలో పాల్గొంటారు. తెలంగాణ కోణంలో చూస్తే కృష్ణానదిపై ఏపీ నిర్మిస్తున్న రాయలసీమ ఎత్తిపోతల పథకం ప్రధాన అభ్యంతరంగా కనిపిస్తోంది. ఏపీ మాత్రం గోదావరి, కృష్ణా నదులపై తెలంగాణా నిర్మిస్తున్న పలు ప్రాజెక్టులపై ఇప్పటికే ఆయా నదీ యజమాన్య బోర్డులకు ఇచ్చిన అభ్యంతరాలను తిరిగి ప్రస్తావించబోతోంది.

వాస్తవానికి ఏపీలో వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇరు రాష్ట్రాలు సమన్వయంతో ముందుకెళ్లాలని.. కోర్టులు, కేంద్రం వద్దకు వెళ్లకుండా సమస్యలు పరిష్కరించుకోవాలి ఇద్దరు సీఎంలు నిర్ణయించారు. ఈ మేరకు ప్రగతిభవన్‌లో సమావేశం కూడా అయ్యారు. జూన్ 21 2019న మహారాష్ట్ర సీఎం, ఏపీ సీఎంలు కేసీఆర్‌ ఆహ్వానం మేరకు కాళేశ్వరం ప్రారంభోత్సవానికి సైతం హాజరయ్యారు. ఇలా అంతా బాగుందనుకున్న దశలో.. ఏపీ ప్రభుత్వం జారీ చేసిన జీవో ఇరు రాష్ట్రాల మధ్య చిచ్చురేపింది. ఈ ఏడాది మే 5న జీవో నెంబర్ 203ను జారీ చేసింది ఏపీ సర్కారు. పోతిరెడ్డిపాడు సామర్థ్యం పెంపు, రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్‌ నిర్మాణంకోసం జారీ చేసిన ఈ జీవో వివాదస్పదమైంది. 2014 విభజన చట్టం ప్రకారం కొత్త ప్రాజెక్టులు నిర్మించాలంటే అపెక్స్ కౌన్సిల్‌లో నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుందని..అభ్యంతరం వ్యక్తం చేస్తూ కేంద్రానికి లేఖ రాసింది తెలంగాణ . అటు ఏపీ ప్రభుత్వం తమ వాటానే తాము తీసుకుంటున్నామని ఇది కొత్త ప్రాజెక్టు కాదని.. తెలంగాణనే గోదావరి నదిపై ఏడు కొత్త ప్రాజెక్టులు నిర్మిస్తోందని కేంద్రానికి ఫిర్యాదు చేసింది. దీంతో ఇరు రాష్ట్రాలు కొత్త ప్రాజెక్టులు చేపట్టవద్దంటూ కేంద్రం ఆదేశించింది.

విభజన చట్టం ప్రకారం నాగార్జున సాగర్ డ్యాం నిర్వహణ తెలంగాణ, శ్రీశైలం డ్యాం నిర్వహణ ఏపీ చూసేలా నిర్ణయించారు.. అయితే పోతిరెడ్డి పాడు ద్వారా నిబంధనలను ఉల్లంఘించి ఏపీ ఎక్కువ మొత్తంలో నీళ్లను తీసుకెళ్తోందని తెలంగాణ అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. శ్రీశైలం డ్యాం నిర్వహణ సైతం తమకే అప్పగించాలని లేఖ రాశారు సీఎం కేసీఆర్. మరింత నష్టం జరగకుండా రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ టెండర్లను రద్దు చేయాలని కోరారు. ఏపీ అభ్యంతరాలపై సైతం లేఖలో వివరణ ఇచ్చారు. గోదావరి నదిపై కడుతున్న కాళేశ్వరంతో పాటు సీతారామ ప్రాజెక్టు, తుపాకులగూడెం, లోయర్ పెనుగంగ, రామప్ప టు పాకాల డైవర్షన్, మిషన్ భగీరథ అన్ని ప్రాజెక్టులు ఉమ్మడి రాష్ట్రంలో కేటాయింపుల మేరకేనని కేంద్రానికి రాసిన లేఖలో పేర్కొన్నారు కేసీఆర్.

అయితే తెలంగాణ ప్రాజెక్టులపై ఏపీ సైతం గట్టిగానే అభ్యంతరాలను తెలుపుతోంది. ప్రాణహిత చేవేళ్ల ప్రాజెక్టు ప్లేస్‌లో నిర్మిస్తున్న కాళేశ్వరం కొత్త ప్రాజెక్టేనని ఏపీ వాదిస్తోంది. మిగితా ఏడు ప్రాజెక్టులు సైతం కొత్తవేనని అభ్యంతరం వ్యక్తం చేసింది.. కృష్ణ జలాలా కేటాయింపుల మేరకే తాము రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ రూపకల్పన చేశామని అంటోంది.

అంతరాష్ట్ర నదీ జలాల వివాద చట్టం 1956 సెక్షన్ 3 ప్రకారం తమ ఫిర్యాదును ట్రిబ్యునల్‌కు నివేదించాల్నిన బాధ్యత కేంద్రానిదేనని.. ఏడేళ్లుగా కేంద్రం ట్రిబ్యునల్‌కు పంపలేదని.. తమ వాటాను కేటాయించడంలో తీవ్రనష్టం జరుగుతోందని తెలంగాణ సీఎం కేసీఆర్ అంటున్నారు. 3 వేల టీఎంసీల గోదావరి జలాలు సముద్రం పాలవుతున్నాయని.. వెయ్యి టీఎంసీలు అదనంగా తెలంగాణకు కేటాయించాల్సినవసరం ఉందన్నారు.. అటు తెలంగాణ వాదిస్తున్న ప్రతిఅంశానికి తాము దీటుగా సమాధానమిస్తామని.. సమర్దవంతగా వాదనలు వినిపిస్తామని ఏపీ చెబుతోంది. మరి ఇరు రాష్ట్రాల జల పంచాయితీని కేంద్రం ఎలా పరిష్కరిస్తోందో చూడాలి.

Tags

Next Story