IAF Wing Commander : వైమానిక దళ అధికారిణిపై వింగ్ కమాండర్ అత్యాచారం
ఇండియన్ ఎయిర్‌ఫోర్స్‌లోని వింగ్ కమాండర్‌పై.. తీవ్ర లైంగిక ఆరోపణలు చేస్తూ.. ఓ మహిళా ఉద్యోగి పోలీసులను ఆశ్రయించడం ప్రస్తుతం తీవ్ర కలకలం రేపుతోంది. గత 2 ఏళ్లుగా మానసికంగా, లైంగికంగా వింగ్ కమాండర్ తనను వేధింపులకు గురి చేస్తున్నాడని సదరు మహిళా ఉద్యోగిని పోలీసులను ఆశ్రయించింది. బాధితురాలి ఫిర్యాదు ఆధారంగా వింగ్ కమాండర్‌పై కేసు పెట్టిన పోలీసులు విచారణ జరుపుతున్నారు. తనను మానసికంగా వేధించడం మాత్రమే కాకుండా ఆ వింగ్ కమాండర్ అత్యాచారానికి పాల్పడ్డారని బాధితురాలు ఆరోపించింది. ఈ క్రమంలోనే జమ్మూ కాశ్మీర్‌లో విధులు నిర్వర్తిస్తున్న ఆ మహిళా అధికారి.. బుద్గాం పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా.. పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు.
శ్రీనగర్ ఎయిర్‌బేస్‌లో పనిచేస్తున్న ఆ వింగ్ కమాండర్.. అదే బేస్‌లో పనిచేసే తనతో గత కొంత కాలంగా అసభ్యంగా ప్రవర్తిస్తున్నట్లు బుద్గాం పోలీసులకు ఓ మహిళా ఉద్యోగి ఫిర్యాదు చేసింది. గత 2 సంవత్సరాలుగా తనను రకరకాలుగా ఆ వింగ్ కమాండర్ మానసికంగా, శారీరకంగా ఇబ్బంది పెట్టినట్లు ఆమె తన గోడు వెళ్లబోసుకుంది. అయితే ఈ ఘటనపై భారత వాయుసేనలోని ఇంటర్నల్ కమిటీకి ఫిర్యాదు చేసినా.. వింగ్ కమాండర్‌పై ఎలాంటి చర్యలు తీసుకోలేదని తెలిపింది. ఆ వింగ్ కమాండర్ పేరు పీకే సెహ్రావత్ అని బాధితురాలు వెల్లడించింది.
అంతేకాకుండా తనతో అసహజ శృంగారంలో పాల్గొనాలని తనను పీకే సెహ్రావత్ బలవంతం చేస్తున్నాడని ఆరోపించింది. గత రెండేళ్లుగా లైంగికంగా, మానసికంగా అనేక రకాలుగా వేధిస్తున్నాడని ఆ మహిళా ఉద్యోగి ఫిర్యాదు చేసింది. దీంతో ఈ కేసుపై విచారణ చేపట్టిన బుద్గాం పోలీసులకు.. భారత వాయుసేన అధికారులు కూడా సహకరిస్తున్నట్లు తెలుస్తోంది. ఇక పీకే సెహ్రావత్‌పై ఐపీసీ సెక్షన్ 376(2) కింద.. ఉన్నత హోదాలో ఉన్న వ్యక్తి చేసిన తీవ్రమైన అత్యాచారం అభియోగాలతో కేసు నమోదు చేశారు. అంతేకాకుండా తదుపరి దర్యాప్తు కోసం ఇన్‌స్పెక్టర్ స్థాయి అధికారికి ఈ కేసును.. పోలీసులు అప్పగించారు.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com