Parliament: నేటి నుంచి పార్లమెంట్ శీతాకాల సమావేశాలు

Parliament: నేటి నుంచి  పార్లమెంట్ శీతాకాల సమావేశాలు
ఎంపీ మహువాపై చర్చించే అవకాశం?

పార్లమెంట్‌ శీతాకాల సమావేశాలు సోమవారం నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ నెల 22వ తేదీ వరకు ఇవి కొనసాగనున్నాయి. మొత్తం 19 రోజుల పాటు ఈ సెషన్ జరగనుండగా.. ఈ సెషన్‌లో మొత్తం 15 సమావేశాలు జరగనున్నాయి. అయితే ఈ శీతాకాల పార్లమెంట్ సమావేశాలు గందరగోళంగా ఉండే అవకాశం ఉంది. ఎందుకంటే సమావేశాలు ప్రారంభమయ్యే మొదటి రోజునే అంటే ఈ రోజే క్యాష్ ఫర్ క్వెరీ’ కేసులో TMC ఎంపీ మహువా మొయిత్రాకు సంబంధించిన ఎథిక్స్ కమిటీ తన నివేదిక సమర్పించనుంది. ఈ నివేదికలో మహువాను సస్పెండ్ చేయాలని కమిటీ సిఫార్సు చేసింది.

ఈ నివేదికను లోక్‌సభ ఆమోదిస్తే మొయిత్రా పార్లమెంట్ సభ్యత్వం ముగుస్తుంది. అలాగే ఈ సమావేశాల్లో అధికార బీజేపీ పలు కీలక బిల్లులను ప్రవేశపెట్టనున్నది. భారత శిక్షాస్మృతి(ఐపీసీ), సీఆర్‌పీసీ, సాక్షాధారాల చట్టం స్థానంలో తీసుకురానున్న మూడు కొత్త బిల్లులను ఈ సమావేశాల్లో ఆమోదింపజేసుకోవాలని మోదీ సర్కారు భావిస్తున్నది. అలాగే ఎన్నికల కమిషనర్ల నియామకాల ప్యానల్‌ నుంచి సీజేఐని తప్పించే బిల్లు కూడా పార్లమెంట్‌లో ప్రవేశపెట్టనున్నది. శీతాకాల సమావేశాల్లో తెలంగాణలో సెంట్రల్ ట్రైబల్ యూనివర్శిటీ ఏర్పాటు బిల్లు, జమ్మూ కాశ్మీర్, పుదుచ్చేరి శాసనసభల్లో మహిళలకు రిజర్వేషన్ కల్పించే బిల్లుతో సహా 7 కొత్త బిల్లులను ప్రభుత్వం సభలో ప్రవేశపెట్టనున్నట్లు తెలుస్తోంది. అలాగే సార్వత్రిక ఎన్నికలకు ముందు జరుగుతున్న ఈ సమావేశాలు వాడీవేడిగా సాగే సూచనలు కనిపిస్తున్నాయి. దేశంలో నెలకొన్న పలు సమస్యలపై చర్చకు విపక్షాలు డిమాండ్ చేయనున్నాయి. సమావేశాలపై 5 రాష్ట్రాల ఫలితాల ప్రభావం ఉండనుంది. అధికార పార్టీ మంచి జోష్‌లో ఉండగా.. ఇండియా కూటమి మాత్రం ఢీలా పడినట్టుగా తెలుస్తోంది.

కొత్తగా తీసుకొస్తున్న నేర బిల్లులకు హిందీలో పేర్లు పెట్టడంపై ప్రతిపక్షాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. వీటిని పార్లమెంట్‌లో వ్యతిరేకించే అవకాశం ఉన్నది. అలాగే మణిపూర్‌లో హింస, పెరుగుతున్న ద్రవ్యోల్బణం, ఈడీ, సీబీఐ వంటి కేంద్ర దర్యాప్తు సంస్థల దుర్వినియోగంపైనా ప్రతిపక్షాలు చర్చకు పట్టుబట్టనున్నాయి. ‘పార్లమెంట్‌లో ఏ అంశంపై చర్చకైనా మేము సిద్ధం. అయితే ఈ చర్చలు స్వల్పకాల వ్యవధితో ఉండాలి. అంతేకాక చర్చలకు అవసరమైన అనుకూలమైన వాతావరణాన్ని సభలో కల్పించాలి’ అని కేంద్ర మంత్రి ప్రహ్లాద్‌ జోషి వ్యాఖ్యానించారు.




Tags

Read MoreRead Less
Next Story