Bihar : ప్రియుడిని అరెస్ట్ చేశారని టవర్ ఎక్కిన ప్రేయసి, వదిలేస్తేనే కిందకు దిగుతానని మొండిపట్టు

బీహార్‌లోని గోపాల్‌గంజ్ జిల్లాలో విస్తుపోయే ఘటన చోటుచేసుకుంది. పోలీసులు అరెస్ట్ చేసిన తన ప్రియుడిని వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ ఓ యువతి మొబైల్ టవర్ ఎక్కి హల్ చల్ చేసింది. సినిమా రేంజ్‌లో జరిగిన ఈ హైడ్రామా స్థానికంగా తీవ్ర చర్చనీయాంశమైంది. భోరే పోలీస్ స్టేషన్ పరిధిలోని బంకట గ్రామంలో ఈ ఘటన జరిగింది.
స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. ఓ పాత కేసుకు సంబంధించి పోలీసులు సదరు యువతి ప్రియుడిని అరెస్ట్ చేశారు. ఈ విషయం తెలుసుకున్న ఆమె తీవ్ర మనస్థాపానికి గురైంది. తన ప్రియుడిని విడిచిపెట్టాలంటూ గ్రామ సమీపంలోని ఓ ఎత్తైన మొబైల్ టవర్ ఎక్కేసింది. తన లవర్‌ను పోలీసులు విడుదల చేసేంత వరకు కిందకు దిగనని అక్కడి నుంచి గట్టిగా కేకలు వేసింది. దీంతో ఒక్కసారిగా అక్కడ గందరగోళం నెలకొంది. యువతి టవర్ ఎక్కిన విషయం తెలియగానే చుట్టుపక్కల ప్రాంతాల నుంచి జనం భారీగా తరలివచ్చారు. కొందరు ఆమెను కిందకు దిగాలని కోరగా, మరికొందరు తమ ఫోన్లలో వీడియోలు తీయడం మొదలుపెట్టారు.
సమాచారం అందుకున్న భోరే పోలీసులు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్నారు. తొలుత పోలీసులు, స్థానికులు ఆమెను కిందకు దిగిరావాలని నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. అయితే ఆమె ఎవరి మాట వినకుండా తన పట్టు వీడలేదు. పరిస్థితి విషమించకుండా ఉండేందుకు పోలీసులు తెలివిగా వ్యవహరించారు. అరెస్ట్ చేసిన ఆమె ప్రియుడిని ఘటనా స్థలానికి తీసుకొచ్చారు. అతడిని చూపించి, ఆమెను క్షేమంగా కిందకు దించేందుకు పోలీసులు, కుటుంబ సభ్యులు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. యువతి ఇంకా టవర్ పైనే ఉండటంతో గ్రామంలో ఉద్రిక్త వాతావరణం కొనసాగుతోంది. ఈ ఘటనపై స్థానికులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.
Tags
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com
