Cyber Crime: కూతురు సెక్స్ రాకెట్‌లో ఉందని సైబర్ నేరగాళ్ల నుంచి ఫోన్..ఆగిన తల్లి గుండె

ఉత్తర్ ప్రదేశ్ ఆగ్రాలో ఘటన..

ఉత్తర్ ప్రదేశ్ ఆగ్రాలో దారుణం జరిగింది. సైబర్ నేరగాళ్ల నకిలీ బెదిరింపులకు, బ్లాక్‌మెయిల్‌కి భయపడిన ఓ మహిళ గుండెపోటుతో మృతి చెందించింది. ప్రభుత్వ ఉపాధ్యాయురాలిగా పనిచేస్తున్న బాధిత మహిళకు, ఆమె కూతురు ‘‘సెక్స్ రాకెట్’’ ఇరుక్కుందని నేరగాళ్లు కాల్ చేసి బెదిరించారు. వెంటనే రూ. 1 లక్ష ట్రాన్స్‌ఫర్ చేయాలని లేకపోతే మీ కూతురు వీడియోలను విడుదల చేస్తామని చెప్పడంతో మహిళ తీవ్రంగా భయపడిపోయింది.

మహిళ తీవ్రంగా భయపడి గుండెపోటుకి గురయ్యారు. ఆమెని ఆస్పత్రికి తరలించే లోపే మరణించారు. ఆగ్రాలో డిజిటల్ అరెస్ట్ కారణంగా మరణించిన తొలి కేసు ఇది. జగదీష్‌పురా పోలీస్ స్టేషన్‌లోని సుభాష్ నగర్ అల్బాటియా నివాసి మల్తీ వర్మ అనే మహిళ అచ్నేరాలోని ప్రభుత్వ జూనియర్ హైస్కూల్‌లో ఉపాధ్యాయురాలిగా పనిచేస్తోంది. ఆమె సెప్టెంబర్ 30న పాఠశాలలో విధులు నిర్వర్తిస్తుండగా, ఆమె మొబైల్‌కి వాట్సాప్ కాల్ వచ్చింది. నిందితుడి డీపీగా పోలీస్ యూనిఫాం ధరించిన వ్యక్తి ఫోటో ఉంది. నిందితుడు మీ కూతురు సెక్స్ రాకెట్‌లో చిక్కుకుందని, ఇంకా కేసు ఫైల్ కాలేదని, మీ పరువు పోకూడదని, మీ కూతురి ఫోటోలు వైరల్ కాకూడదనే ఉద్దేశంతోనే ఫోన్ చేశానని, లక్ష రూపాయలు పంపిస్తే రిలీజ్ చేస్తామని చెప్పాడు.

నిందితుడు ఒక నెంబర్ పంపించి, దానికి 15 రోజుల్లో రూ. లక్ష పంపాలని చెప్పాడు. లేదంటే మీ కూతురిపై చర్యలు తీసుకుంటానని బెదిరించాడు. దీంతో భయపడిన మాల్తీవర్మ తన కొడుకు దీపాంశుకు ఫోన్ చేసింది. ఈ సమయంలో కాల్ చేసిన వ్యక్తి సుమారు అరగంట పాటు ఆమెని డిజిటల్ అరెస్ట్‌లో ఉంచాడు. కొడుకుకి నిందితుడి నెంబర్ పంపించి, తాను పంపిన నెంబర్‌కి రూ. లక్ష పంపాలని చెప్పింది.

అయితే, కొడుకు దీపాంశుకి ఈ నెంబర్ చూసి అనుమానం వచ్చింది. ఈ నెంబర్ మన దేశానికి చెందిన నెంబర్ కాదని అనిపించి, నెంబర్ తప్పుగా ఉందని తల్లి మాల్తీ వర్మకు చెప్పాడు. దీంతో తనకు వచ్చిన ఫోన్ గురించి కుమారుడితో మొత్తం చెప్పింది. అయినా కూడా తన కూతురు సెక్స్ రాకెట్‌లో చిక్కుకుందని భయపడుతూనే ఉంది. కొడుకు దీపాంశు తన ఇద్దరు సోదరీమణులు ఎక్కడ ఉన్నారని ఆరా తీయగా, ఒకరు పాఠశాలలో మరొకరు బజారులో ఉన్నట్లు తేలింది. వారిద్దరు తల్లితో మాట్లాడేలా చేశారు. అయినా కూడా మాల్తీ వర్మ షాక్ నుంచి బయపడక, భయపడుతూనే ఉంది. ఇంటికి చేరుకున్న వెంటనే గుండెపోటుకి గురై మరణించింది.

Tags

Next Story