Wife Kills Husband: ప్రియుడితో కలిసి భర్తను హత్య చేసిన భార్య..

ఉత్తరప్రదేశ్‌లోని దేవరియా జిల్లాలో దారుణ ఘటన చోటుచేసుకుంది. ఓ సూట్‌కేస్‌పై ఉన్న ఎయిర్‌లైన్ బ్యాగేజ్ ట్యాగ్, చిరునామా ఆధారంగా పోలీసులు ఓ హత్య కేసును ఛేదించారు. వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నాడని భర్తను, అతని మేనల్లుడితో కలిసి ఓ భార్య కిరాతకంగా హత్య చేసినట్లు తేలింది.
వివరాల్లోకి వెళితే.. దేవరియా జిల్లా పకరి ఛపర్ పట్ఖౌలీ గ్రామంలోని ఓ వ్యవసాయ క్షేత్రంలో ఏప్రిల్ 20న స్థానికులు ఓ ట్రాలీ సూట్‌కేస్‌ను గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు వచ్చి సూట్‌కేస్‌ను తెరిచి చూడగా, అందులో తలపై గాయాలతో ఉన్న ఓ వ్యక్తి మృతదేహం లభ్యమైంది. సూట్‌కేస్‌పై ఉన్న ఎయిర్‌లైన్ బ్యాగేజ్ ట్యాగ్, దానిపై రాసి ఉన్న చిరునామా ఆధారంగా పోలీసులు దర్యాప్తు చేపట్టారు. విచారణలో మృతుడు భటోలీ ప్రాంతానికి చెందిన నౌషాద్ అహ్మద్ (38)గా గుర్తించారు. దుబాయ్‌లో డ్రైవర్‌గా పనిచేస్తున్న నౌషాద్, పది రోజుల క్రితమే స్వదేశానికి తిరిగి వచ్చాడు.
మృతుడి ఇంటికి చేరుకున్న పోలీసులు, నౌషాద్ భార్య రజియాను అదుపులోకి తీసుకుని విచారించగా అసలు విషయం వెలుగులోకి వచ్చింది. తన భర్త మేనల్లుడు రోమన్ తో ఉన్న వివాహేతర సంబంధానికి నౌషాద్ అడ్డుగా ఉన్నాడని, అందుకే ఏప్రిల్ 19 రాత్రి రోమన్, అతని స్నేహితుడు హిమాన్షు సహాయంతో భర్తను పదునైన ఆయుధంతో హత్య చేసినట్లు రజియా అంగీకరించింది. అనంతరం మృతదేహాన్ని సూట్‌కేస్‌లో కుక్కి, తమ ఇంటి నుంచి సుమారు 60 కిలోమీటర్ల దూరంలోని పొలంలో పడేసినట్లు పోలీసులకు తెలిపింది.
దేవరియా ఎస్పీ విక్రాంత్ వీర్ మాట్లాడుతూ.. "సూట్‌కేస్‌పై ఉన్న ట్యాగ్, అడ్రస్ ఆధారంగా మృతుడిని గుర్తించాం. ప్రధాన నిందితురాలైన రజియాను అరెస్ట్ చేశాం. ఆమె ఇచ్చిన సమాచారం మేరకు పరారీలో ఉన్న రోమన్, హిమాన్షుల కోసం గాలిస్తున్నాం. త్వరలోనే వారిని పట్టుకుంటాం" అని తెలిపారు. నౌషాద్‌కు తన మేనల్లుడు రోమన్‌తో తరచూ గొడవలు జరుగుతున్నాయని, ఈ విషయంలో భార్యాభర్తల మధ్య కూడా విభేదాలు ఉన్నాయని ప్రాథమిక విచారణలో తేలిందని ఆయన పేర్కొన్నారు. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com