Madhya Pradesh: స్నేహితుడితో భార్య ఎఫైర్.. తట్టుకోలేక కుటుంబం మొత్తం ఆత్మహత్య

భార్య వివాహేతర సంబంధం, ఆపై తప్పుడు కేసు పెడతానన్న బెదిరింపులు ఒక కుటుంబాన్ని బలిగొన్నాయి. ఈ అత్యంత విషాదకరమైన ఘటన మధ్యప్రదేశ్‌లోని సాగర్ జిల్లాలో చోటుచేసుకుంది. ఓ మహిళ వివాహేతర సంబంధం కారణంగా ఆమె భర్త, అత్త, ఇద్దరు పిల్లలు తీవ్ర మనస్తాపంతో ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది.
పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం, సాగర్ జిల్లాకు చెందిన మనోహర్ లోధి (45) భార్య ద్రౌపది, తన భర్త చిన్ననాటి స్నేహితుడితో వివాహేతర సంబంధం కొనసాగిస్తోంది. ఈ విషయం మనోహర్ కుటుంబ సభ్యులకు తెలియడంతో వారు ద్రౌపదిని నిలదీశారు. సంబంధాన్ని వదులుకోవాలని హెచ్చరించారు. అయితే, అందుకు ఆమె నిరాకరించడమే కాకుండా, తనను వేధిస్తున్నారంటూ తన భర్త, అత్తమామలపై తప్పుడు వరకట్న వేధింపుల కేసు పెడతానని బెదిరించింది.
భార్య బెదిరింపులతో తీవ్ర ఆందోళనకు గురైన మనోహర్ లోధి, అతడి తల్లి ఫూల్రాని లోధి (70), కూతురు శివాని (18), కుమారుడు అంకిత్ (16) తీవ్ర నిర్ణయం తీసుకున్నారు. జులై 26వ తేదీ రాత్రి నలుగురూ కలిసి సల్ఫాస్ మాత్రలు మింగి ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఈ ఘటనలో ఫూల్రాని, అంకిత్ అక్కడికక్కడే మరణించగా, ఆసుపత్రిలో చికిత్స పొందుతూ శివాని ప్రాణాలు విడిచింది. తీవ్ర అస్వస్థతకు గురైన మనోహర్ లోధిని జిల్లా ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో మృతి చెందాడు.
కుటుంబం మొత్తాన్ని ఆత్మహత్యకు పురిగొల్పిన ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఆత్మహత్యకు ప్రేరేపించారన్న ఆరోపణలపై మనోహర్ భార్య ద్రౌపదిని, ఆమె ప్రియుడిని అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై మరింత లోతుగా విచారణ జరుపుతున్నట్లు వారు పేర్కొన్నారు.
Tags
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com