Women reservation bill: బుధవారమే బిల్లు?

Women reservation bill:  బుధవారమే బిల్లు?
మహిళలకు 33 శాతం ప్రాతినిధ్యం ఉండాలన్న వాదన

పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు ప్రారంభమయ్యాయి. అయిదు రోజుల పాటు జరిగే ఈ సమావేశాల్లో... దాదాపు మూడు దశాబ్దాలుగా పెండింగ్‌లో ఉన్న మహిళా రిజర్వేషన్ బిల్లును ప్రవేశపెట్టే అవకాశాలు ఉన్నాయని వార్తలు వస్తున్నాయి. ఈ మేరకుబుధవారం నాడు ఈ బిల్లును నరేంద్రమోదీ ప్రభుత్వం ప్రవేశపెట్టవచ్చునని భావిస్తున్నారు. మహిళా రిజర్వేషన్ బిల్లును దాదాపు ఏ పార్టీ కూడా వ్యతిరేకించే పరిస్థితి లేదు. ఇప్పటికే పలు పార్టీలు మహిళా రిజర్వేషన్ బిల్లు ప్రవేశపెట్టాలని డిమాండ్ కూడా చేస్తున్నాయి. మోదీ ప్రభుత్వం బిల్లు ప్రవేశపెడితే దాదాపు అన్ని పార్టీలు మద్దతిచ్చే అవకాశాలే కనిపిస్తున్నాయి.

వాస్తవానికి సోమవారం నుంచి సమావేశాలు ప్రారంభం కావడానికి ఒకరోజు ముందు ప్రభుత్వం అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేసింది. ఇందులో ప్రతిపక్ష కూటమి ఇండియా సహా ఎన్డీయే నేతలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మహిళా రిజర్వేషన్ బిల్లు గురించి చర్చ జరిగింది. దీనికి ఇటు అధికార పక్షం నేతలు, అటు విపక్ష నేతలు అందరూ సముఖత వ్యక్తం చేశారు. దీన్నిబట్టి ఈ బిల్లును చాలా తేలికగా పార్లమెంటు ఆమోదించవచ్చని స్పష్టమైంది.


కాంగ్రెస్‌, దాని మిత్రపక్షాల నుంచి మహిళా రిజర్వేషన్‌ బిల్లు తీసుకురావాలనే డిమాండ్‌ వినిపిస్తోంది. దీనిపై బీజేపీ, ఎన్సీపీ వంటి మిత్రపక్షాలు కూడా ఈ విషయంలో తమకు అండగా నిలుస్తున్నాయని చెప్పారు. పార్లమెంట్‌ కార్యకలాపాలను కొత్త భవనానికి మార్చిన సందర్భంగా మహిళా రిజర్వేషన్‌ బిల్లును ఆమోదించి చరిత్ర సృష్టించాలని భారత రాష్ట్ర సమితి , తెలుగుదేశం పార్టీ , బిజూ జనతాదళ్‌ ప్రభుత్వాన్ని అభ్యర్థించాయి. మహిళా రిజర్వేషన్ బిల్లుకు టీఎంసీ కూడా మద్దతిస్తున్నట్లు కనిపించింది. అయితే ఆర్‌జేడీ, సమాజ్‌వాదీ వంటి కొన్ని ప్రాంతీయ పార్టీలు మహిళలకు రిజర్వేషన్లు కల్పించాలని ప్రస్తావిస్తూనే.. వెనుకబడిన కులాలు, షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ కులాల మహిళలకు రిజర్వేషన్లలో కోటాను నిర్ణయించే అంశాన్ని కూడా లేవనెత్తాయి.

ప్రస్తుత 17వ లోక్ సభలో 15 శాతం కంటే దిగువన మహిళా ఎంపీలు ఉన్నారు. 2022లో రాజ్యసభలో 28.3 శాతం మహిళలు ఉన్నారు. 1952లో లోక్ సభలో మహిళా ఎంపీలు 4.4 శాతం, రాజ్యసభలో కేవలం 2 శాతం ఉన్నారు. దాదాపు దేశంలో సగం జనాభా ఉన్న మహిళలకు కనీసం 33 శాతం వాటా ఉండాలనే వాదన ఎప్పటి నుంచో ఉంది. ఈ నేపథ్యంలో ఈ ప్రత్యేక సమావేశాల్లో మోదీ ప్రభుత్వం మహిళా రిజర్వేషన్ బిల్లు ప్రవేశపెట్టే అవకాశాలు ఉన్నట్లుగా వార్తలు వస్తున్నాయి.


Tags

Next Story