Women reservation bill: కేంద్ర కేబినెట్ ఆమోదం!

Women reservation bill:  కేంద్ర కేబినెట్ ఆమోదం!
బిల్లుకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపినట్లుగా జాతీయ మీడియాలో వార్తలు

మహిళా రిజర్వేషన్‌ బిల్లుకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. పార్లమెంట్, అసెంబ్లీ ఎన్నికల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు కల్పించే ఈ కీలక బిల్లును ప్రధాని అధ్యక్షతన సమావేశమైన కేబినెట్‌ ఆమోదం తెలిపిందని వార్తలు వస్తున్నాయి. అయితే, ప్రభుత్వం అధికారికంగా ప్రకటించాల్సి ఉంది. సాధారణంగా కేబినెట్ సమావేశం తర్వాత ఈ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను కేంద్రమంత్రులు మీడియాకు చెబుతారు. కానీ ఈ రోజు కేబినెట్ సమావేశం వివరాలను వెల్లడించకపోవడంతో... మహిళా రిజర్వేషన్ బిల్లుకు కేబినెట్ ఆమోదంపై మరింత స్పష్టత రావాల్సి ఉంది.

ప్రత్యేక పార్లమెంట్ సమావేశాల తొలి సమావేశం ముగిసిన తర్వాత సాయంత్రం 6:30 గంటలకు సమావేశాన్ని ఏర్పాటు చేశారు.ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశానికి కేంద్ర మంత్రులు రాజ్‌నాథ్ సింగ్, అమిత్ షా, పీయూష్ గోయల్, ప్రహ్లాద్ జోషి, ఎస్ జైశంకర్, నిర్మలా సీతారామన్, ధర్మేంద్ర ప్రధాన్, నితిన్ గడ్కరీ, అర్జున్ రామ్ మేఘవాల్ తదితరులు హాజరయ్యారు. ఆ సమావేశంలో బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా కూడా పాల్గొన్నారు. అనంతరం ప్రధాని నరేంద్ర మోడీ అధ్యక్షతన మంత్రివర్గ సమావేశం జరిగింది. ఐదు రోజులపాటు జరగనున్న ఈ సమావేశాల్లో పలు పార్టీలు మహిళా రిజర్వేషన్‌ బిల్లును పార్లమెంట్‌లో ప్రవేశపెట్టనున్నారు.


మహిళలకు చట్టసభల్లో 33 శాతం రిజర్వేషన్ కల్పించాలని మూడు దశాబ్ధాల క్రితం నుంచే ఉద్యమం నడుస్తోంది. దీంతో మహిళా రిజర్వేషన్ బిల్లును 1996లో అప్పటి హెచ్‌డీ దేవెగౌడ సారధ్యంలోని యునైటెడ్ ఫ్రంట్ ప్రభుత్వం.. ఆ తర్వాత వచ్చిన వాజ్ పేయీ, మన్మోహన్ సింగ్ ప్రభుత్వం లోక్ సభలో ప్రవేశపెట్టినా ఆమోదముద్ర పడలేదు. రాజ్యసభలో 2010లో ఆమోదం పొందినా.. 2014లో లోక్ సభ రద్దు కావడంతో ఆ బిల్లు అలాగే ఉండిపోయింది .


మహిళా రిజర్వేషన్‌ బిల్లుతో పాటు ఓబీసీ బిల్లును ఆమోదించనున్నట్లు తెలుస్తోంది. ఈ ప్రత్యేక పార్లమెంట్ సమావేశాల్లో చరిత్రాత్మక నిర్ణయాలు ఉంటాయని ప్రధాని మోడీ పేర్కొన్న విషయం తెలిసిందే. పార్లమెంటు ప్రత్యేక సెషన్‌లో ‘వన్‌ నేషన్-వన్‌ ఎలక్షన్‌’ బిల్లు, ఇండియాకు భారత్‌గా పేరు మార్చే తీర్మానం అనే రెండు అంశాలు చర్చకు రానున్నాయి. అయితే దీనికి సంబంధించి అధికారికంగా ఎలాంటి ప్రకటన వెలువడలేదు.


Tags

Next Story