Women Reservation Bill: మహిళా బిల్లుకు చట్టరూపం

పార్లమెంట్ ఆమోదించిన మహిళా రిజర్వేషన్ల బిల్లు చట్టరూపు దాల్చింది. ఈ బిల్లుపైరాష్ట్రపతి ద్రౌపది ముర్ము సంతకం చేశారు. లోక్ సభ, శాసన సభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు కల్పించే ఈ బిల్లుకు ఇటీవలే పార్లమెంట్ ఉభయసభలు..ఆమోద ముద్ర వేశాయి. రాష్ట్రపతి ఆమోదం తర్వాత ఇందుకు సంబంధించి కేంద్ర న్యాయ శాఖ గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఉపరాష్ట్రపతి, రాజ్యసభ చైర్మన్ జగ్‌దీప్ ధన్‌కర్ మహిళా రిజర్వేషన్ బిల్లుపై సంతకం చేసి, రాష్ట్రపతి ఆమోదం కోసం సమర్పించారు. రాష్ట్రపతి బిల్లుపై సంతకం చేయడంతో చట్టంగా మారింది.
106వ రాజ్యాంగ సవరణ ద్వారా.. చట్ట సభల్లో మహిళలకు కేంద్రం 33శాతం రిజర్వేషన్లు కల్పించింది. జనాభా లెక్కల తర్వాత చేపట్టే... డిలిమిటేషన్ అనంతరం మహిళా రిజర్వేషన్లు..అమల్లోకి వస్తాయి. కేంద్ర ప్రభుత్వం అధికారిక గెజిట్ లో నోటిఫికేషన్ ద్వారా ఖరారు చేసే తేదీ నుంచి ఇది అమలవుతుంది. చట్టసభల్లో మహిళలకు 33శాతం రిజర్వేషన్లు కల్పించేందుకు ఉద్దేశించిన మహిళా రిజర్వేషన్ బిల్లును ‘నారీ శక్తి వందన్ అధినియమ్ పేరుతో కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ సెప్టెంబర్ 19న లోక్‌సభలో, సెప్టెంబరు 21న రాజ్యసభలో ప్రవేశపెట్టారు. ఆ బిల్లును రాష్ట్రపతి తాజాగా ఆమోదించడంతో మూడు దశాబ్దాల నిరీక్షణకు తెరపడినట్లయింది. అయితే, ఈ చట్టం ఇప్పుడే అమల్లోకి వచ్చే అవకాశాలు కనిపించడం లేదు. జనగణన, డీలిమిటేషన్ తర్వాత ఈ చట్టాలు అమల్లోకి తీసుకురానున్నట్లు బిల్లుపై చర్చ సందర్భంగా ప్రధాని మోదీ లోక్‌సభకు తెలిపారు.
చట్టసభల్లో మహిళా రిజర్వేషన్ల అంశం ఇప్పటిది కాదు. ఈ బిల్లును 1996లో హెచ్‌డీ దేవెగౌడ సారథ్యంలోని యునైటెడ్ ఫ్రంట్ ప్రభుత్వం తొలుత లోక్‌సభలో ప్రవేశపెట్టింది. తర్వాత వాజ్‌పేయీ, మన్మోహన్ సింగ్ ప్రభుత్వాల హయాంలోనూ ప్రవేశపెట్టినప్పటికీ ఈ బిల్లు సభ ఆమోదానికి నోచుకోలేదు. చివరకు ఈ బిల్లు 2010లో రాజ్యసభ ఆమోదం పొందినా లోక్‌సభలో మాత్రం పెండింగులోనే ఉండిపోయింది. 2014లో లోక్‌సభ రద్దు కావడంతో అక్కడ బిల్లు మురిగిపోయింది. తాజాగా మోదీ నేతృత్వంలోని కేంద్రం ప్రభుత్వం పార్లమెంట్ ప్రత్యేక సమావేశాల్లో మహిళా రిజర్వేషన్ల బిల్లును తీసుకొచ్చింది. ఉభయసభలు ఆమోదించిన ఈ బిల్లును తాజాగా రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ఆమోదించారు. .రాజకీయాల్లో మహిళలకు సముచిత స్థానం కల్పించకుండా సమ్మిళిత సమాజం, ప్రజాస్వామ్య సమైక్యత గురించి మాట్లాడలేమని ప్రధాని నరేంద్రమోడీ అన్నారు. కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ కూడా ఈ బిల్లుకు మద్దతు ఇస్తున్నట్లు ప్రకటించారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com