Large shivling : మధ్యలోనే నిలిచిపోయిన ప్రపంచంలోనే అతిపెద్ద శివలింగం తరలింపు , కారణం ఏంటంటే

ప్రపంచంలోనే అతిపెద్ద, అత్యంత బరువైన శివలింగాన్ని తరలించడం బీహార్‌లోని గోపాల్‌గంజ్ జిల్లా అధికారులకు పెద్ద సవాలుగా మారింది. గండక్ నదిపై (స్థానికంగా నారాయణి నది అని పిలుస్తారు) ఉన్న వంతెన శిథిలావస్థకు చేరడంతో శివలింగం ప్రయాణం మధ్యలోనే నిలిచిపోయింది.
తమిళనాడులోని మహాబలిపురంలో తయారు చేసిన ఈ శివలింగం ఆదివారం ఉదయం గోపాల్‌గంజ్‌కు చేరుకుంది. ఈ శివలింగం బరువు సుమారు 210 టన్నులు కాగా, దీనిని తరలిస్తున్న 106 చక్రాల ప్రత్యేక ట్రైలర్ బరువు మరో 160 టన్నులు. ఈ రెండింటి మొత్తం బరువును వంతెన మోయలేదని, ప్రాథమిక తనిఖీల్లో వంతెనపై చాలాచోట్ల పగుళ్లు ఉన్నట్లు గుర్తించడంతో భద్రతాపరమైన ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి.
పరిస్థితిని సమీక్షించేందుకు జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ (NHAI), బీహార్ రాజ్య పుల్ నిర్మాణ్ నిగమ్ లిమిటెడ్ (BRPNNL) బృందాలను పిలిపించినట్లు జిల్లా కలెక్టర్ పవన్ కుమార్ సిన్హా తెలిపారు. బీహార్ మంత్రి అశోక్ చౌదరి కూడా గోపాల్‌గంజ్‌కు వచ్చి వంతెనను స్వయంగా పరిశీలించనున్నారు.
ఈ శివలింగాన్ని తూర్పు చంపారన్ జిల్లా కేంద్రమైన మోతిహారిలోని విరాట్ రామాయణ్ ఆలయానికి తరలించాల్సి ఉంది. ఇందుకోసం మహాబలిపురం నుంచి 3,178 కిలోమీటర్ల దూరం ప్రయాణించి 32 రోజుల్లో ఈ వాహనం ఇక్కడికి చేరుకుంది.
అయితే, తూర్పు చంపారన్ చేరుకోవడానికి రెండు ప్రత్యామ్నాయ మార్గాలు ఉన్నప్పటికీ, వాటి పరిస్థితి కూడా సంతృప్తికరంగా లేదని అధికారులు చెబుతున్నారు. ఒక మార్గంలోని వంతెన సామర్థ్యం సరిపోదని, మరో మార్గంలో కూడా అనేక చిన్న వంతెనలు, కల్వర్టులు ఉండటంతో భారీ వాహనం ప్రయాణించడం కష్టమని తేలింది. దీంతో శివలింగాన్ని సురక్షితంగా గమ్యస్థానానికి చేర్చేందుకు అధికారులు అన్ని మార్గాలను అన్వేషిస్తున్నారు.
Tags
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com

