Wrestlers protest : ఇకపై రోడ్లు కాదు కోర్టుకెక్కుతాం

భారత రెజ్లింగ్ సమాఖ్య అధ్యక్షుడు బ్రిజ్ భూషణ్‌పై తాము చేస్తున్న పోరాటాన్ని ఇకపై న్యాయస్థానంలోనే కొనసాగిస్తామని మహిళా రెజ్లర్లు ప్రకటించారు. ఇకపై రోడ్లపై పోరాటం చేయకుండా న్యాయస్థానాల నుంచి పోరాడాలని నిర్ణయించుకున్నామన్నారు. తమపై బ్రిజ్ భూషణ్ లైంగిక వేధింపులకు పాల్పడ్డాడని, అతనిపై చర్య తీసుకోవాలంటూ ఐదు నెలలుగా రోడ్లపై చేస్తున్న పోరాటాన్ని ముగిస్తున్నామన్నారు.
రెజ్లర్లు తమ పోరాట పంధాని మార్చుకున్నారు.బ్రిజ్ భూషణ్‌పై కేసు నమోదు చేసుకోవాలంటూ ఇన్నాళ్లూ నిర్వహించిన ఆందోళన విరమిస్తున్నట్టు తెలిపారు. బ్రిజ్‌భూషణ్ సింగ్‌పై పోరాటాన్ని ఇకపై కోర్టులో నిర్వహిస్తామని అగ్రశ్రేణి రెజ్లర్లు వినేశ్ ఫొగట్, సాక్షి మాలిక్, బజరంగ్ పూనియా స్పష్టం చేశారు. ట్విటర్ వేదికగా తమ నిర్ణయాన్ని వెల్లడించారు. ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు తమ డిమాండ్లను అమలు చేసిందని, ఆరుగురు మహిళా రెజ్లర్లు దాఖలు చేసిన ఎఫ్‌ఐఆర్ ఆధారంగా లైంగిక వేధింపుల ఆరోపణలపై విచారణ జరిపిన తర్వాత ఢిల్లీ పోలీసులు బ్రిజ్‌భూషణ్‌పై చార్జిషీట్ నమోదు చేశారు. అందుకే ఇకపై పోరాటం రోడ్లపై కాదు, కోర్టులో కొనసాగుతుందని వారు పేర్కొన్నారు.
డబ్ల్యూఎఫ్‌ఐ సంస్కరణలో భాగంగా కేంద్రమంత్రి వాగ్దానం చేసినట్టుగా ఎన్నికల ప్రక్రియ కూడా ప్రారంభమైంది. ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు జూలై 11న ఎన్నికలు నిర్వహించాల్సి ఉంది. కాబట్టి ఈ హామీ పూర్తి అమలు కోసం వేచి చూస్తామన్నారు. ప్రస్తుతానికి తాము చార్జ్ షీట్ కాపీ కోసం వేచి ఉన్నామని అది బలంగా ఉందో లేదో పరిశీలిస్తామని, ఏది ఏమైనా బ్రిజ్ భూషణ్ ను కటకటాల వెనక్కి నెట్టే వరకు పోరాటాన్ని కొనసాగిస్తామని అన్నారు. అయితే ఆ పోరాటం ఎలా కొనసాగించాలి అన్న విషయం చార్జిషీటులో ఉన్న అంశాల ఆధారంగా ఉంటుందన్నారు. అయితే ఇప్పటికీ తమ పోరాటం ముగియ లేదని వారు స్పష్టం చేశారు.
బ్రిజ్‌భూషణ్‌కు వ్యతిరేకంగా ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద చాలా రోజులపాటు నిరసన చేపట్టిన రెజ్లర్లు. కేంద్ర క్రీడా శాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్ హామీతో తాత్కాలికంగా నిరసనలను విరమించారు. అయితే ఈ విరమణ జూన్ 15 వరకు మాత్రమే అని రెజ్లర్లు తేల్చి చెప్పారు. ట్వీట్ చేసిన తరువాత తాము కొంతకాలం పాటు సోషల్ మీడియా నుంచి విరామం తీసుకుంటున్నట్లు వినేశ్ ఫొగాట్, సాక్షి మాలిక్ ప్రకటించారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com