రెజ్లర్ల ఆందోళనకు తాత్కాలిక బ్రేక్‌

రెజ్లర్ల ఆందోళనకు తాత్కాలిక బ్రేక్‌
బీజేపీ ఎంపీ, జాతీయ రెజ్లింగ్ సమాఖ్య అధ్యక్షుడు బ్రిజ్ భూషణ్ కు వ్యతిరేకంగా రెజ్లర్లు చేస్తున్న ఆందోళనలకు తాత్కాలికంగా బ్రేక్ పడింది

బీజేపీ ఎంపీ, జాతీయ రెజ్లింగ్ సమాఖ్య అధ్యక్షుడు బ్రిజ్ భూషణ్ కు వ్యతిరేకంగా రెజ్లర్లు చేస్తున్న ఆందోళనలకు తాత్కాలికంగా బ్రేక్ పడింది. బుధవారం కేంద్ర క్రీడల మంత్రి అనురాగ్ ఠాగూర్‌తో సుదీర్ఘ చర్చల అనంతరం రెజ్లర్లు తమ నిరసనలు తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్టుగా ప్రకటించారు. ఈ నెల 15 వ తేదీ లోగా బ్రిజ్ భూషణ్ పై చర్యలు తీసుకోవాలని లేకుంటే తమ నిరసన తిరిగి కొనసాగిస్తామని స్పష్టం చేశారు.

లైంగిక వేధింపుల ఆరోపణలను ఎదుర్కొంటున్న బ్రిజ్ భూషణ్ సింగ్ పై చర్యలు తీసుకోవాలనే డిమాండ్‌తో గత కొంతకాలంగా పలువురు రెజ్లర్లు నిరసనలకు దిగిన విషయం తెలిసిందే. గత శనివారం కేంద్ర హోం మంత్రి అమిత్ షా తో భేటీ తర్వాత రెజ్లర్లు తమ విధులకు హాజరైనప్పటికీ నిరసనలను మాత్రం నిలిపివేయక పోవడంతో కేంద్ర క్రీడల మంత్రి అనురాగ్ ఠాకూర్, రెజ్లర్ల తో మరో సమావేసానికి సిద్ధం అయ్యారు. మాట్లాడుకుందాం రమ్మంటూ ట్విట్టర్ వేదికగా పిలుపునిచ్చారు. దీంతో బుధవారం ఉదయం బజరంగ్ పునియా, సాక్షి మాలిక్ లు అనురాగ్ ఠాకూర్ తో సమావేశం అయ్యారు. ఆరు గంటల సుదీర్ఘ చర్చల అనంతరం అనురాగ్ ఠాకూర్ మీడియాతో మాట్లాడారు.

రెజ్లర్లతో భేటీ సానుకూలంగా ముగిసిందని, వారి ఆరోపణలకు సంబంధించి జూన్ 15వ తేదీలోగా చార్జ్ షీట్ దాఖలు చేస్తామని హామీ ఇచ్చామన్నారు. అలాగే మహిళా రెజ్లర్ల భద్రత పై ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటామని, రెజ్లర్ల పై నమోదు చేసిన ఎఫ్ఐఆర్ లను రద్దు చేస్తున్నట్టుగా ప్రకటించారు. భారత రెజ్లింగ్ సమాఖ్య కు జూన్ 30 లోపు ఎన్నికల నిర్వహిస్తామని చెప్పారు.

ఈ సందర్భంగా మీడియా తో మాట్లాడిన రెజ్లర్లు కేంద్రం నుంచి రాతపూర్వక హామీ లభించినందువల్లే తాము ఈ నిర్ణయానికి వచ్చినట్టు వెల్లడించారు. పలు ఆరోపణలు ఎదుర్కొంటున్న బ్రిజ్ భూషణ్, అతని అనుచరులను, కుటుంబ సభ్యులను రెజ్లింగ్ సమాఖ్యకు దూరంగా ఉంచాలని కోరారు. పోలీసులు జూన్ 15వ తేదీలోగా విచారణ పూర్తి చేస్తామని చెప్పారని కాబట్టి అప్పటివరకు మాత్రమే తమ నిరసనలని ఆపివేస్తున్నామని, ఇచ్చిన గడువు లోగా చర్యలు తీసుకోకుంటే నిరసనలు తిరిగి ప్రారంభమవుతాయని హెచ్చరించారు.

మరోవైపు పోలీసులు బ్రిడ్జ్ భూషణ్ చరణ్ సింగ్ పై వచ్చిన లైంగిక వేధింపుల ఫిర్యాదులపై దర్యాప్తు ముమ్మరం చేశారు. ఒక మైనర్ తో పాటు పలువురు రెజ్లర్లు ఫిర్యాదులు చేయడంతో ఢిల్లీ పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు.

Tags

Read MoreRead Less
Next Story