WFI: రెజ్లింగ్ సమాఖ్య ఎన్నికలు మళ్లీ వాయిదా

నేడు జరగాల్సి ఉన్న భారత రెజ్లింగ్ సమాఖ్య(WFI) ఎన్నికలు మరోసారి వాయిదా పడ్డాయి. రెజ్లింగ్ సమాఖ్య ఎన్నికలను తాత్కాలికంగా నిలిపేస్తూ పంజాబ్-హరియాణా హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. జులై 6 నుంచి జులై 11 మధ్యే WFI ఎన్నికలు జరగాల్సి ఉన్నా ఆ తర్వాత ఆగస్టు 12న జరుగుతాయని ప్రకటన వెలువడింది. తాజాగా హైకోర్టు ఉత్తర్వులతో మరోసారి ఆ ప్రక్రియ వాయిదాపడింది. WFI సమాఖ్య మాజీ అధ్యక్షుడు, భాజపా ఎంపీ బ్రిజ్‌భూషణ్‌పై కొద్దినెలల క్రితం దేశ అగ్రశ్రేణి మహిళా రెజ్లర్లు లైంగిక ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. ఆ ఆరోపణల నేపథ్యంలో డబ్ల్యూఎఫ్‌ఐ ప్యానెల్‌ను ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్(IOA) రద్దు చేసింది. కార్యవర్గ సభ్యుల పదవీకాలం ముగియడంతో IOA ఎన్నికలు నిర్వహించేందుకు సిద్ధమైంది.
బ్రిజ్‌భూషణ్(BJP MP Brij Bhushan ) కుటుంబం నుంచి ఎవరూ ఈ ఎన్నికల్లో పోటీ చేయరని తెలిపారు. కానీ, ఎంపీ మద్దతుదారులు 18 మంది నామినేషన్లు వేశారు. తన అనుచరుల ద్వారా సమాఖ్యను నియంత్రించేందుకు ప్రయత్నిస్తున్నారనే ఆరోపణలు వినిపించాయి. అలాగే తన గ్రూపునకు 25 రాష్ట్ర సంఘాల మద్దతు ఉందని బ్రిజ్‌భూషణ్ ఇప్పటికే వ్యాఖ్యానించారు.
మరోవైపు లైంగిక ఆరోపణలపై కోర్టులో బ్రిజ్‌భూషణ్‌పై విచారణ జరుగుతోంది. ఈ కేసులో బ్రిజ్ భూషణ్‌కు ఢిల్లీలోని రూస్ అవెన్యూ కోర్టు జూలై 20న బెయిల్ మంజూరు చేసింది. ఈ మేరకు జస్టిస్ హర్జీత్ సింగ్ జస్పాల్ ఉత్తర్వులు జారీ చేశారు. బ్రిజ్ భూషణ్ అనుమతి లేకుండా దేశం విడిచి వెళ్లరాదని కోర్టు ఆదేశించింది.
లైంగిక వేధింపుల ఆరోపణలపై కోర్టుకు హాజరైన బ్రిజ్ భూషణ్ తనను తాను గట్టిగా సమర్థించుకున్నారు. నేరపూరిత, లైంగిక ఉద్ధేశం లేకుండా స్త్రీని తాకడం నేరం కాదని బ్రిజ్ భూషణ్ తరఫు న్యాయవాది రాజీవ్ మోహన్ వాదనలు వినిపించారు. ఈ వాదనలపై తీవ్ర విమర్శలు వచ్చాయి. 2017, 2018సంవత్సరాల్లో జరిగిన ఆరోపించిన సంఘటనల ఆధారంగా 2023లో ఫిర్యాదు దాఖలైందని బ్రిజ్‌భూషణ్ న్యాయవాది పేర్కొన్నారు. ఈ ఆలస్యానికి కెరీర్ అనే భయం తప్పితే బలమైన కారణమేదీ వారు చెప్పకపోవడం గమనార్హం అన్నారు. రెజ్లింగ్ ఈవెంట్‌లలో ఎక్కువగా మగ కోచ్‌లు ఉంటారని, విజయం కోసం మహిళా రెజ్లర్లను మగ కోచ్ కౌగిలించుకోవడం సాధారణమేనన్నారు. మంగోలియా, జకార్తాలలో ఇలాంటి కొన్ని ఘటనలు జరిగినట్టు ఆరోపించారని, అవి ఇండియాలో జరగలేవు కాబట్టి, ఇక్కడ విచారించరాదని అన్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com