Grok Obscene Images Row: ‘గ్రోక్‌’ అసభ్య కంటెంట్‌ వ్యవహారం.. 600 ఖాతాలు డిలీట్‌

Grok Obscene Images Row: ‘గ్రోక్‌’ అసభ్య కంటెంట్‌ వ్యవహారం.. 600 ఖాతాలు డిలీట్‌
X
ఐటీ మంత్రిత్వ శాఖ ఆదేశాలతో రంగంలోకి ఎక్స్

సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ 'ఎక్స్' (గతంలో ట్విట్టర్)పై కేంద్ర ప్రభుత్వం కొరడా ఝళిపించింది. ప్లాట్‌ఫామ్‌లో అశ్లీలతను ప్రోత్సహించే విధంగా ఉన్న కంటెంట్‌ను తొలగించాలని ఆదేశించడంతో ఎక్స్ యాజమాన్యం చర్యలకు ఉపక్రమించింది. ప్రభుత్వ వర్గాల సమాచారం ప్రకారం.. ఇప్పటివరకు 3,500కు పైగా పోస్టులను బ్లాక్ చేయడంతో పాటు, నిబంధనలు ఉల్లంఘించిన 600కు పైగా అకౌంట్లను ఎక్స్ తొలగించింది.

ముఖ్యంగా ఎక్స్ ఏఐ సర్వీస్ 'గ్రోక్' (Grok) ద్వారా అసభ్యకరమైన, అశ్లీల చిత్రాలు, వీడియోలు సృష్టించబడుతున్నాయని కేంద్ర ఎలక్ట్రానిక్స్, ఐటీ మంత్రిత్వ శాఖ గత వారం ఆందోళన వ్యక్తం చేసింది. దీనిపై జనవరి 2నే స్పందించిన ప్రభుత్వం.. మహిళల గౌరవానికి భంగం కలిగించేలా ఉన్న కంటెంట్‌ను తక్షణమే తొలగించాలని, లేనిపక్షంలో ఐటీ చట్టం కింద కఠిన చర్యలు తప్పవని హెచ్చరించింది.

ఈ క్రమంలోనే ఎక్స్ సంస్థ తన 'కంటెంట్ మోడరేషన్' ప్రక్రియను మరింత బలోపేతం చేస్తామని కేంద్రానికి నివేదించింది. భారతీయ నిబంధనలకు కట్టుబడి ఉంటామని, భవిష్యత్తులో గ్రోక్ ఏఐ లేదా ఇతర సేవల ద్వారా ఇలాంటి చట్టవిరుద్ధమైన కంటెంట్ సర్క్యులేట్ కాకుండా కఠిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చింది. ఐటీ చట్టం 2000, ఐటీ రూల్స్ 2021లోని నిబంధనలను పాటించడం తప్పనిసరి అని కేంద్రం మరోసారి స్పష్టం చేసింది.

Tags

Next Story