Jaishankar: చైనాలో ఎస్.జైశంకర్ పర్యటన..

భారత విదేశాంగ మంత్రి ఎస్.జైశంకర్ చైనాలో పర్యటిస్తున్నారు. ఐదు సంవత్సరాల తర్వాత తొలిసారిగా చైనా పర్యటనకు వెళ్లిన జైశంకర్.. సోమవారం బీజింగ్‌లో చైనా ఉపాధ్యక్షుడు హాన్ జెంగ్‌తో సమావేశం అయ్యారు. ప్రపంచ వ్యాప్తంగా నెలకొన్న ఉద్రిక్తతల నేపథ్యంలో చైనాతో బహిరంగ చర్చలకు జైశంకర్ పిలుపునివ్వడం ఆసక్తిరేపుతోంది. ఇప్పటికే రష్యాతో సత్సంబంధాలు ఉన్న దేశాలపై 500 శాతం సుంకాలు విధిస్తామంటూ ట్రంప్ హెచ్చరిస్తు్న్నారు. ఇలాంటి పరిస్థితుల్లో చైనాతో భారత్ ప్రత్యక్ష చర్చలు జరపడం ఆసక్తి రేపుతోంది. ప్రస్తుతం రష్యాతో చైనా, భారత్ సంబంధాలు కొనసాగుతున్నాయి.
ఇదిలా ఉంటే చైనా పర్యటనపై జైశంకర్ సానుకూలతను వ్యక్తం చేశారు. ద్వైపాక్షిక సంబంధాలు బలపడబోతున్నట్లు తెలిపారు. సానుకూలంగా జరుగుతున్నట్లు జైశంకర్ విశ్వాసం వ్యక్తం చేశారు. ఇక హాన్ జెంగ్‌తో జరిగిన సమావేశంలో చైనా షాంఘై సహకార సంస్థ (SCO) అధ్యక్ష పదవికి భారతదేశం మద్దతు వ్యక్తం చేసింది. ఈ మేరకు జైశంకర్ ఎక్స్‌లో పోస్టు చేశారు. ‘‘ఈరోజు నేను బీజింగ్‌కు వచ్చిన వెంటనే ఉపాధ్యక్షుడు హాన్ జెంగ్‌ను కలవడం సంతోషంగా ఉంది. చైనా SCO అధ్యక్ష పదవికి భారతదేశం మద్దతు తెలియజేశాను. ద్వైపాక్షిక సంబంధాలలో మెరుగుదలను గమనించాను. నా పర్యటన సమయంలో జరిగే చర్చలు సానుకూల పథాన్ని కొనసాగిస్తాయనే విశ్వాసాన్ని వ్యక్తం చేశాను.’’ అని పేర్కొన్నారు. గత అక్టోబర్‌లో కజాన్‌లో ప్రధాని మోడీ-చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ సమావేశం తర్వాత.. ఇరు దేశాల ద్వైపాక్షిక సంబంధాలు క్రమం క్రమంగా మెరుగుపడుతున్నట్లు కనిపిస్తోంది. ఇక భారతదేశం-చైనా దౌత్య సంబంధాలకు 75 ఏళ్లు పూర్తయ్యాయని జైశంకర్ పేర్కొన్నారు.
ద్వైపాక్షిక సంబంధాలపై చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యిని కూడా జైశంకర్ కలవనున్నారు. జైశంకర్-వాంగ్ యి చివరిసారిగా ఫిబ్రవరిలో జోహన్నెస్‌బర్గ్‌లో జరిగిన జీ20 సమావేశంలో కలుసుకున్నారు. ఇక జూలై 15న టియాంజిన్‌లో జరిగే షాంఘై సహకార సంస్థ (SCO) విదేశాంగ మంత్రుల సమావేశానికి కూడా జైశంకర్ హాజరవుతారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com