DELHI FLOODS: యమున మహోగ్రరూపం..కేజ్రీవాల్ ఇంటి సమీపానికి వరద

దేశ రాజధాని ఢిల్లీ(Delhi)లో యమునా నది మహోగ్రరూపం దాల్చి... ప్రజలను భయబ్రాంతులకు గురిచేస్తోంది. హరియాణ నుంచి వస్తున్న వరదతో యమునా నది (Yamuna River) ప్రమాదస్థాయిని మించి ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. చరిత్రలో తొలిసారి నది నీటిమట్టం ఆల్‌టైం గరిష్టానికి చేరింది. దీంతో ఢిల్లీలోని అనేక కాలనీలు, మార్కెట్లను వరద (floods) ముంచెత్తింది. ఢిల్లీ పాత రైల్వే వంతెన వద్ద యమునానది నీటి మట్టం 208.05 మీటర్లకు చేరిందని కేంద్ర జల సంఘం ప్రకటించింది. గురువారం ఉదయం 8 గంటల నుంచి 10 గంటల మధ్య ఇది మరింత పెరిగి, మధ్యాహ్నం 2 గంటల నుంచి తగ్గుముఖం పడుతుందని అంచనా వేసింది.
యమునా నది ప్రమాదకర స్థాయి 205.33 మీటర్లు కాగా రెండు రోజుల కిందటే దానిని దాటేసింది. 207 మీటర్లను దాటడం పదేళ్ల తర్వాత ఇదే తొలిసారి. 1978లో నీటి మట్టం 207.49 మీటర్లకు చేరడంతో ఢిల్లీని వరదలు (Delhi Floods) ముంచెత్తాయి. ప్రస్తుతం ఆ రికార్డును కూడా దాటేయడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. లోతట్టు ప్రాంతాల నుంచి 16 వేల మంది ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. కొన్ని కాలనీల్లోకి వరద నీరు నాలుగు అడుగుల మేర చేరగా.. ఢిల్లీ రోడ్డు రవాణా సంస్థ ప్రధాన కార్యాలయాన్ని నీరు ముంచెత్తింది. ఢిల్లీలోని అన్ని ఫ్లైఓవర్‌లు, సర్వీస్ లేన్‌లు వరద బాధితులు, వారి పశువులతో నిండిపోయాయి.
సివిల్ లైన్స్ ప్రాంతంలోని రింగ్ రోడ్ వరదలతో నిండిపోయింది. మజ్ను కా తిలాను కశ్మీరీ గేట్ ఐఎస్బీటీతో కలిపే మార్గం మూసివేశారు. కేజ్రీవాల్ నివాసం, ఢిల్లీ అసెంబ్లీకి కేవలం 500 మీటర్ల దూరం వరకు వరద వచ్చేసింది. యమునా బజార్, మొనాస్టరీ మార్కెట్, నిగంబోధ్ ఘాట్‌లో నడుం లోతు వరకు నీరు చేరింది. చాలా ప్రాంతాలు వరదల్లో చిక్కుకున్నాయి. పాత యుమున వంతెనపై ట్రాఫిక్‌ను పూర్తిగా నిలిపివేశారు.
హరియాణాలోని హత్నికుండా బ్యారేజ్ వద్ద యమున నది నీటి మట్టం గురువారం ఉదయానికి 208.46 మీటర్లకు చేరింది. ఇది ప్రమాదకర స్థాయి కంటే మూడు మీటర్లు ఎక్కువ. దీంతో బ్యారేజీ నుంచి నీటిని విడుదల చేస్తూనే ఉన్నారు. ఈ నేపథ్యంలో బ్యారేజ్ నుంచి నీటి విడుదల నిలిపివేయాలని కేంద్రాన్ని కేజ్రీవాల్ కోరారు. అయితే, పూర్తిస్థాయి నీటి మట్టం దాటేయడంతో విడుదల చేస్తున్నట్టు కేంద్రం పేర్కొంది.
అధికారులతో అత్యవసర సమావేశం ఏర్పాటు చేసిన కేజ్రీవాల్... వేచి చూడకుండా వెంటనే ఇళ్లను ఖాళీ చేయాలని ఢిల్లీ లోతట్టు ప్రాంత ప్రజలను హెచ్చరించారు. ఢిల్లీ పోలీసులు నగరంలో సమావేశాలను నిషేధించారు. వరదలు సంభవించే ప్రాంతాల్లో ముందు జాగ్రత్తగా 144 సెక్షన్‌ను విధించారు. సహాయక చర్యలను సమీక్షించడానికి ఢిల్లీ డిజాస్టర్ మేనేజ్‌మెంట్ అథారిటీ ఇవాళ సాయంత్రం సమావేశం కానుంది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com