Yashwant Sinha: రాష్ట్రపతి అభ్యర్ధిగా యశ్వంత్ సిన్హా నామినేషన్.. 14 పార్టీల నేతల మద్దతు..

Yashwant Sinha: విపక్షాల ఉమ్మడి రాష్ట్రపతి అభ్యర్ధిగా యశ్వంత్ సిన్హా నామినేషన్ వేశారు. ఢిల్లీలోని పార్లమెంట్ భవనంలో రిటర్నింగ్ అధికారికి నామినేషన్ పత్రాలను సమర్పించారు.. మొత్తం నాలుగు సెట్ల నామినేషన్లు వేశారు.. ఈ నామినేషన్ కార్యక్రమానికి కాంగ్రెస్ తరపున రాహుల్ గాంధీ, మల్లికార్జున ఖర్గే, ఎన్సీపీ నేత శరద్ పవార్, సమాజ్‌వాదీ పార్టీ అధినేత అఖిలేష్, సీతారాం ఏచూరి, ఫరూక్ అబ్దుల్లా హాజరయ్యారు. ఇక టీఆర్ఎస్ తరపున మంత్రి కేటీఆర్‌తో పాటు ఎంపీలు.. యశ్వంత్ సిన్హా నామినేషన్ కార్యక్రమానికి వెళ్లారు.
టీఆర్ఎస్ తరపున ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌తో పాటు ఎంపీలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అయితే, సిన్హా నామినేషన్ దాఖలు చేసే సమయంలో కేటీఆర్ ముందు వరుసలో కూర్చోవడం విశేషం. రెండో వరుసలో టీఎంసీ, శివసేన, డీఎంకే, ఆర్జేడీ, ఎన్సీతోపాటు పలు పార్టీలకు చెందిన నాయకులున్నారు. ఇక నామినేషన్ దాఖలు చేసిన తర్వాత విజయ్ చౌక్ వద్దకు నేతలంతా వెళ్లి మహాత్మ గాంధీ, అంబేద్కర్ విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ పోరును భావజాలాల మధ్య పోరాటంగా ప్రతిపక్ష నేతలు అభివర్ణించారు. యశ్వంత్ సిన్హా అభ్యర్థిత్వానికి చివరి నిమిషంలో టీఆర్‌ఎస్ మద్దతు ప్రకటించింది.
కాంగ్రెస్‌తో కలిసి వెళ్లే విషయం, అభ్యర్థిని ఎంచుకునే విషయంలో అసంతృప్తిగా ఉన్నప్పటికీ చివరకు విపక్షాలతో కలసి వెళ్లాలని నిర్ణయించుకుంది.. ఈ నేపథ్యంలోనే నామినేషన్ కార్యక్రమానికి టీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ను పంపారు అధినేత కేసీఆర్. బీజేపీ నిలబెట్టిన రాష్ట్రపతి అబ్యర్థిని తాము తిరస్కరిస్తున్నామని కేటీఆర్ చెప్పారు. భీష్ముడు మంచివాడైనా ఓటమి తప్పలేదన్నారు.. ద్రౌపది ముర్ముపై తమకు ఎలాంటి వ్యతిరేకత లేదని, బీజేపీ నిరంకుశ వైఖరిని మాత్రమే వ్యతిరేకిస్తున్నామని చెప్పారు. యశ్వంత్ సిన్హా అన్ని విధాల సమర్థుడని.. ఆయన గెలవాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తున్నామని కేటీఆర్ చెప్పారు.
ప్రస్తుత మద్దతులు చూసుకున్నా రాష్ట్రపతిగా ఎన్డీయే అభ్యర్ధి ద్రౌపది ముర్ముకే మెజారిటీ ఉండటంతో ఆమే గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.. అయితే, యశ్వంత్ సిన్హా నామినేషన్ కోసం ప్రతిపక్షాల నుంచి చాలా పార్టీల నేతలు హాజరవడం ప్రాధాన్యం సంతరించుకుంది.. గెలిచే బలం లేనప్పటికీ విపక్షాలు రాష్ట్రపతి ఎన్నికలో గట్టిగా పోరాడాలని నిర్ణయించుకున్నాయి.
వచ్చే ఎన్నికల కోసం విపక్షాల ఐక్యత ఎలా ఉంటుందో పరీక్షించుకోడానికి రాష్ట్రపతి ఎన్నిక కూడా ఓ సందర్భంగా భావిస్తున్నాయి. అటు ఇప్పటికే బీఎస్పీ, బీజేడీ ఇప్పటికే ఎన్డీయే అభ్యర్థి ద్రౌపది ముర్ముకు మద్దతు ప్రకటించగా.. ఆమ్ ఆద్మీ పార్టీ, జార్ఖండ్ ముక్తి మోర్చా పార్టీలు కూడా యశ్వంత్ సిన్హా నామినేషన్‌కు తమ ప్రతినిధులను పంపకపోవడం చర్చనీయాంశంగా మారింది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com