క్యాష్ వద్దు అవార్డు చాలు

క్యాష్ వద్దు అవార్డు చాలు
X
కేంద్రం ఇవ్వనున్న రూ.1 కోటి నగదు పురస్కారాన్ని తిరస్కరించిన గీతాప్రెస్

గోరఖ్‌పూర్‌లోని గీతా ప్రెస్‌కు కేంద్రం 2021 ఏడాదికి సంబంధించి గాంధీ శాంతి బహుమతిని ప్రకటించిన విషయం తెలిసిందే. నరేంద్ర మోదీ నేతృత్వంలోని జ్యూరీ ఏకగ్రీవంగా పురస్కారానికి గీతా ప్రెస్‌ను ఎంపిక చేసింది. అయితే పురస్కారంతో పాటు రూ.కోటి పారితోషకాన్ని తీసుకునేందుకు గీతా ప్రెస్‌ ట్రస్ట్‌ నిరాకరించింది.

దీనికి ట్రస్ట్ నగదు రూపంలో విరాళాలు స్వీకరించకూడదనే నియమం ఉండటమే కారణం. రామాయణం, భారతం, భాగవతం రాసిన వాళ్ళు వేర్వేరు కావచ్చు, వేరు వేరు సంస్థలు ఈ పుస్తకాలను ప్రచురించొచ్చు. కానీ వీటిలో ఏది ప్రామాణికమైన ముద్రణ అంటే ముందు చెప్పేది గీతా ప్రెస్ పేరే. మూల గ్రంధాలు సేకరించి వాటిని ప్రింట్ చేయడమే గీతా ప్రెస్ ప్రత్యేకత. ఇప్పటికి ఈ ప్రెస్ 14 భాషల్లో 41.7 కోట్ల పుస్తకాలను ప్రచురించింది. ఇందులో 16.2 కోట్ల ముద్రణలు భగవద్గీతకు సంబంధించినవి. గీతా ప్రెస్ 1923లో ఏర్పాటు అయ్యింది. అందుకే ఇప్పుడు శతాబ్ది ఉత్సవాలు జరుపుకుంటోంది. ఈ సమయంలోనే కేంద్ర ప్రభుత్వం గీతాప్రెస్ కు అవార్డు ప్రకటించింది.

గాంధీ శాంతి బహుమతిని 1995లో కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింది. మహాత్మాగాంధీ ఆదర్శాలకు నివాళిగా దీన్ని ప్రతి ఏటా ప్రకటిస్తారు. జాతి, కుల, మతంతో సంబంధం లేకుండా అందరూ దీనికి అర్హులే. ఈ అవార్డు కింద 1 కోటి రూపాయల నగదు బహుమతితో పాటు ఒక ప్రశంసా పత్రం, జ్ఞాపిక మరియు సాంప్రదాయ హస్తకళ / చేనేత వస్తువును అందిస్తారు. నరేంద్ర మోదీ అధ్యక్షతన గల జ్యూరీ సంప్రదింపుల తర్వాత గీతా ప్రెస్ ను ఈ అవార్డు కోసం ఏకగ్రీవంగా ఎంపిక చేసినట్టు కేంద్ర సాంస్కృతిక శాఖ ప్రకటించింది. అవార్డు విషయంపై మోదీ గీతాప్రెస్ కు అభినందనలు తెలియచేసారు.అయితే గీతాప్రెస్ ఒక కీలక నిర్ణయం తీసుకుంది. కేంద్రం ఇచ్చిన రూ.1 కోటి నగదును గీతాప్రెస్ తిరస్కరిస్తున్నట్లుగా తెలిపింది. నగదు రూపంలో విరాళాలు స్వీకరించకూడదనే నియమం ఉంది.

ఈ విషయం పై సంస్థ ప్రతినిధులు మాట్లాడుతూ. ప్రతిష్టాత్మక అవార్డుకు ఎంపిక కావడం గర్వంగా ఉందని, గౌరవప్రదమైన విషయమనీ అన్నారు. కానీ ఎలాంటి విరాళాలు స్వీకరించకూడదనేది తమ సూత్రమని, కాబట్టి నగదు రూపంలో వచ్చే అవార్డు ప్రోత్సాహకాలు తీసుకోకూడదని ట్రస్టీ బోర్డ్ నిర్ణయించిందని చెప్పారు. ఈ మొత్తాన్ని వేరేచోట ఖర్చు చేయాలని కోరారు. నిజానికి గీతా ప్రెస్ మూతపడుతోంది, ఆర్థిక మాంద్యం లో ఉంది అని చాలా వార్తలు బయటకు వచ్చాయి. కానీ అదంతా నిజం కాదని ఎప్పటికప్పుడు ఖండిస్తూనే ఉన్నారు సంస్థ యాజమాన్యం. ఇప్పుడు కూడా తమకు నగదు అవసరం లేదు అవార్డు మాత్రం చాలు అని చెప్పడం వారిని ఒక మెట్టు పైన నిలుచో బెట్టింది.

Tags

Next Story