Yogi Adityanath: యూపీ సీఎంగా రెండోసారి యోగి ఆదిత్యనాథ్ ప్రమాణ స్వీకారం..

Yogi Adityanath: ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రిగా చరిత్ర సృష్టిస్తూ వరుసగా రెండోసారి యోగి ఆదిత్యనాథ్ ప్రమాణ స్వీకారం చేశారు. యోగి ప్రమాణ స్వీకారోత్సవానికి అగ్రనేతలు తరలివచ్చారు. ప్రధాని నరేంద్ర మోదీతో పాటు రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, పలువురు కేంద్రమంత్రులు, బీజేపీ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు, పెద్దసంఖ్యలో బీజేపీ నేతలు హాజరయ్యారు. పెద్దసంఖ్యలో తరలివచ్చిన కార్యకర్తలతో వాజ్‌పేయి స్టేడియం జనసంద్రంగా మారింది. కాషాయరంగు పులుముకుంది.
లక్నోలోని వాజ్‌పేయి స్టేడియంలో అరంగంగవైభవంగా ప్రమాణస్వీకారోత్సవం జరిగింది. యోగి ఆధిత్యనాథ్ చేత ముఖ్యమంత్రిగా గవర్నర్ ఆనందీ బెన్ పటేల్ ప్రమాణ స్వీకారం చేయించారు. యోగిని ప్రధాని మోదీ ఆలింగనం చేసుకుని అభినందించారు.
మొత్తం 52 మందితో యోగి ఆదిత్యనాథ్ తన కేబినెట్‌ను ఏర్పాటు చేశారు. యోగి ప్రభుత్వంలో కేశవ్ ప్రసాద్ మౌర్య, బ్రజేష్ పాఠక్‌లు మరోసారి ఉపముఖ్యమంత్రులుగా ప్రమాణం స్వీకారం చేశారు. మంత్రివర్గంలో ఈసారి యువతకు అధిక ప్రాధాన్యం ఇచ్చారు యోగి. దాదాపు 30 మంది కొత్తవారికి అవకాశం కల్పించారు. అలాగే ఐదుగురు మహిళా మంత్రులకు కూడా అవకాశం దక్కింది.
యూపీలోని 403 అసెంబ్లీ స్థానాలకు ఏడు దశల్లో జరిగి ఎన్నికల్లో బీజేపీ ఘన విజయం సాధించింది. బీజేపీ 255 స్థానాల్లో, దాని మిత్ర పక్షాలు18 స్థానాల్లో గెలుపొందాయి. 273 సీట్ల మెజార్టీతో యూపీలో మరోసారి అధికారం చేపట్టింది బీజేపీ. తొలిసారి ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలిచిన యోగి ఆదిత్యనాథ్ రెండోసారి సీఎం పదవిని చేపట్టి రికార్డు సృష్టించారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com