Yogi Adityanath: ట్వీట్ ఫైట్

ఫ్రాన్స్‌లో అల్లర్లను అరికట్టేందుకు యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ను ఆ దేశానికి పంపాలని జర్మనీకి చెందిన ప్రొఫెసర్ చేసిన ఓ ట్వీట్ ఇప్పుడు వార్తల్లోకి ఎక్కింది. ఆ ట్వీట్ పై యోగి కార్యాలయం స్పందించడంతో విపక్షాలు మండిపడ్డాయి. మరోవైపు అసలు ఈ ట్విట్టర్ అకౌంట్ ఎంతవరకు నిజమైనది అన్న దానిపై కూడా ఆరా తీస్తున్నారు.
పారిస్‌లో జరుగుతున్న అల్లర్లపై జర్మనీకి చెందిన ప్రొఫెసర్ కార్డియాలజిస్ట్ ఎన్.జాన్ కామ్ ఒక ట్వీట్ చేశారు. యోగి ఆదిత్యనాథ్ను అక్కడకి పంపితే 24 గంటల్లో అక్కడి వారిని కట్టడి చేయగలరని అభిప్రాయ పడ్డారు. ఈ ట్వీట్ సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవ్వడం తో దానిపై యోగి ఆదిత్యనాథ్ కార్యాలయం స్పందించింది. ప్రపంచంలో ఓ ప్రాంతంలోనైనా తీవ్రవాదం అల్లర్లకు ఆజ్యం పోసినప్పుడు, శాంతి భద్రతలకు విఘాతం కలిగినప్పుడు ఉత్తర్‌ప్రదేశ్‌లో నేరస్థులపై ఉక్కుపాదం మోపే యోగి మోడల్ ను అనుసరించాల్సిందే అని ట్వీట్ చేసింది.
అయితే ఈ ఐడీ పై నెటిజన్లు అనుమానాలు వ్యక్తం చేశారు. జాన్‌కామ్ ట్విట్టర్ హ్యాండిల్ నకిలీది అంటున్నారు. మరోవైపు.. జర్మనీ వైద్యుడు చేసిన ట్వీట్‌పై యోగి ఆదిత్యనాథ్ కార్యాలయం స్పందించడంపై AIMIM చీఫ్, ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ సెటైర్లు వేశారు. విదేశీయుల ప్రశంసల కోసం బీజేపీ తహతహలాడుతోందని ఎద్దేవా చేశారు. ట్వీట్ చేసిన వ్యక్తి ట్విట్టర్ ఖాతా నకిలీదని కూడా చూడలేదన్నారు.
ఫ్రాన్స్ లో 17 ఏళ్ల నహేల్ అనే యువకుడు పోలీసులు కాల్పుల్లో మరణించాడు. దీంతో రాజధాని పారిస్ గత నాలుగు రోజులుగా అట్టుడికిపోతోంది. ఇప్పటి వరకు 13 వందలమంది నిరసనకారులను పోలీసులు అరెస్ట్ చేశారు. నిరసనకారుల దాడుల్లో ఇప్పటివరకు 300 మందికి పైగా పోలీసులు గాయపడ్డారు. భారీ ఎత్తున భద్రతా బలగాలను మోహరించినప్పటికీ నిరసనకారులను అదుపు చేయడం కష‌్టంగా మారింది. కొందరు గుంపులు గుంపులుగా వచ్చి దుకాణాలను లూటీ చేశారు. మార్సెయిల్ లోని ఓటుపాకుల దుకాణంలో చొరబడిన అల్లరిముకలు ఆయుధాలు ఎత్తుకెళ్లారు. పట్టపగలే కొందరు కొందరు తీవ్రస్థాయిలో హింసకు పాల్పడుతున్నారు. పారిస్ సహా అనేక ప్రాంతాల్లో దుకాణాలను లూటీ చేస్తున్నారు. ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా ప్రభుత్వం బస్సు, రైలు సర్వీసులను తాత్కాలికంగా నిలిపివేసింది, ప్రభుత్వ కార్యక్రమాలు రద్దు అయ్యాయి. అల్లర్లను అదుపులో ఉంచడానికి యువతను ఇంటి దగ్గరే ఉండాల్సిందిగా చూడాలని తల్లిదండ్రులకు ఫ్రాన్స్ అధ్యక్షులు విజ్ఞప్తి చేశారు. సోషల్ మీడియా పై కూడా ఆంక్షలు విధించారు. విపరీత పరిణామాల నేపథ్యంలో ఫ్రాన్స్ అధ్యక్షుడు మేక్రాన్ తన జర్మనీ పర్యటనను రద్దు చేసుకున్నారు. పోలీసుల గట్టి బందోబస్తు కారణంగా అల్లర్లు అతి త్వరలోనే సర్దుమడుగుతాయని ఆయన అభిప్రాయ పడ్డారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com