RESEARCH: ప్రాణాలు తోడేస్తున్న ప్లాస్టిక్‌ బాటిల్‌

RESEARCH: ప్రాణాలు తోడేస్తున్న ప్లాస్టిక్‌ బాటిల్‌
ప్లాస్టిక్‌ బాటిళ్లు ఆరోగ్యాన్ని దెబ్బతీస్తున్నాయన్న అమెరికా శాస్త్రవేత్తలు... ఒక లీటరు ప్లాస్టిక్‌ సీసా నీటిలో సగటున 2.40లక్షల ప్లాస్టిక్‌ రేణువులు

మనిషి అవసరాల్లో భాగమైన వస్తువు ప్లాస్టిక్‌ బాటిల్‌. ఇంట్లో నీళ్లు నిల్వ చేసుకోవడానికైనా, పని మీద బయటకు వెళ్లినపుడైనా, కార్యాలయమైనా ప్లాస్టిక్‌ సీసా తప్పనిసరి. అయితే ఈ బాటిళ్లు ఆరోగ్యాన్ని దెబ్బతీస్తున్నాయని అమెరికా శాస్త్రవేత్తలు తేల్చారు. ప్లాస్టిక్‌ బాటిళ్లలోని నీటిలో నానో ప్లాస్టిక్‌లు ఉంటాయన్న వాదన చాలా కాలంగా వినిపిస్తుండగా వాటిని గుర్తించే సాంకేతికతను అమెరికాలోని కొలంబియా విశ్వవిద్యాలయానికి చెందిన పరిశోధకుల బృందం అభివృద్ధి చేసింది. దాని సహాయంతో అమెరికాలోని మూడు ప్రముఖ కంపెనీల ప్లాస్టిక్‌ సీసా నీళ్లలపై పరిశోధనలు చేసిన శాస్త్రవేత్తలు విస్తుపోయే వాస్తవాలను వెల్లడించారు. ఒక లీటరు ప్లాస్టిక్‌ సీసా నీటిలో సగటున 2.40లక్షల ప్లాస్టిక్‌ రేణువులు ఉన్నట్లు కనుగొన్నారు. ఇప్పటి వరకు అంచనా వేసిన దాని కంటే ఇది వంద రెట్లు ఎక్కువ. ఇందులో పది శాతం సూక్ష్మ ప్లాస్టిక్‌ రేణువులు, 90శాతం అతి సూక్ష్మ ప్లాస్టిక్‌ రేణువులు. అయిదు మిల్లీమీటర్ల నుంచి ఒక మైక్రోమీటర్‌ వరకు ఉన్న రేణువులను మైక్రోప్లాస్టిక్‌లుగా పేర్కొంటారు. ఒక మైక్రోమీటర్‌ కన్నా తక్కువ మందంలో ఉన్న వాటిని నానో ప్లాస్టిక్‌లుగా వర్గీకరించారు. చాలా సూక్ష్మంగా ఉండడం వల్ల మనిషి కణాలు, రక్తం, గుండె, కిడ్నీల్లోకి ఇవి సులభంగా ప్రవేశిస్తాయి. గర్భంలో ఉన్న శిశువుల శరీరంలోకి కూడా ఇవి చేరే ముప్పు ఉంది.


సాధారణంగా ప్లాస్టిక్‌ సీసాలను పౌడర్‌ రూపంలో ఉండే మైక్రో ప్లాస్టిక్‌తో తయారు చేస్తారు. వీటిలో నీటిని నిల్వ చేసినపుడు అతి సూక్ష్మ కణాలు కరిగి అందులో చేరుతాయి. ఉష్ణోగ్రతలు ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో ఇంకా అధిక పరిణామంలో నానో ప్లాస్టిక్‌లు కలుస్తాయి. శాస్త్రవేత్తల అధ్యయనం ప్రకారం ప్లాస్టిక్‌ సీసా నీటిలో ప్రధానంగా ఏడు రకాల అవశేషాలు ఉంటాయి. నీటి శుద్ధికి ఎక్కువగా ఉపయోగించే పాలీ అమైడ్‌, ప్లాస్టిక్‌ బాటిళ్ల తయారీలో ఉపయోగించే పాలీ ఇథలీన్‌ టెరెఫ్టలేట్‌....P.E.T, పాలీ వినైల్‌ క్లోరైడ్‌, పాలీ మిథైల్‌ మెథాక్రిలేట్‌, పాలిస్టరీన్‌ ప్లాస్టిక్‌లను శాస్త్రవేత్తలు కనుగొన్నారు. వీటితో పాటు అనేక రేణువులను గుర్తించి వాటి వర్గీకరణపై దృష్టి సారించారు. వీటి వల్ల క్యాన్సర్లు, కిడ్నీ, కాలేయ వ్యాధుల బారిన పడే ప్రమాదం ఉంది. మధుమేహం, అధిక బరువు వంటివి కూడా పెరగవచ్చని నిపుణులు హెచ్చరిస్తున్నారు. బిస్‌ఫినాల్‌ -ఎ...B.P.A అనే రసాయన పదార్థం చాలా ప్రమాదకరమైనది. గతంలో ప్లాస్టిక్‌ సీసాల తయారీలో దీన్ని ఎక్కువగా వినియోగించే వారు. దీని వల్ల దుష్ప్రభావాలు ఎక్కువగా ఉన్నాయనే కారణంతో B.P.A రహిత సీసాలనే తయారు చేస్తున్నామని కంపెనీలు చెబుతున్నాయి.


B.P.A రహిత సీసాలనే తయారు చేస్తున్నామని కంపెనీలు చెబుతున్నా ఏడు రకాల ప్లాస్టిక్‌తో తయారు చేసిన సీసాల్లో వాటి అవశేషాలు కనిపిస్తున్నాయని అధ్యయనాలు చెబుతున్నాయి. మానవుల పునరుత్పత్తిపై B.P.A తీవ్ర ప్రభావం చూపిస్తుంది. B.P.Aతో తయారైన ప్లాస్టిక్‌ సీసాలోని నీటిని తాగిన మహిళలు, పురుషుల్లో హార్మోన్ల అసమతుల్యతను గుర్తించినట్లు పలు అధ్యయనాలు వెల్లడించాయి. గర్భిణులు ఇలాంటి బాటిళ్ల నీరు ఎక్కువగా తాగితే పుట్టబోయే పిల్లల్లో మానసిక సమస్యలు తలెత్తుతాయని, క్యాన్సర్‌ బారిన పడే ప్రమాదం కూడా ఉందని అవి హెచ్చరిస్తున్నాయి. బాలికలు చిన్న వయసులోనే రజస్వల కావడానికి ప్లాస్టిక్‌ సీసాల వినియోగమూ ఒక కారణం అని తేలింది. ఇలా అనేక రూపాల్లో ప్లాస్టిక్‌ సీసాలు మనుషుల ఆరోగ్యాన్ని హరిస్తున్నాయి.

Tags

Next Story