Bengaluru: రేణుకాస్వామి హత్య తరహాలో యువకుడిపై దాడి..

Bengaluru: రేణుకాస్వామి హత్య తరహాలో యువకుడిపై దాడి..
X
దర్శన్‌ కేసు స్ఫూర్తితో

కర్ణాటకలో గతేడాది రేణుకాస్వామి హత్య కేసు జాతీయ స్థాయిలో తీవ్ర సంచలనం సృష్టించింది. ప్రియురాలు పవిత్ర గౌడ్‌కు అభిమాని అసభ్యకరమైన సందేశాలు పంపించి.. నిత్యం వేధిస్తుండడంతో నటుడు దర్శన్ రంగ ప్రవేశం చేసి.. రేణుకాస్వామిని అత్యంత దారుణంగా హింసించి చంపేశాడు. ఇది కర్ణాటక రాష్ట్రాన్నే కాకుండా యావత్తు దేశాన్ని కుదిపేసింది.

తాజాగా అదే తరహాలో బెంగళూరులో మరో ఘటన జరిగింది. మాజీ ప్రియురాలికి అసభ్య సందేశాలు పంపిస్తున్నాడని పది మందితో కూడిన ముఠా.. యువకుడిని కిడ్నాప్ చేసి క్రూరంగా దాడి చేశారు. దర్శన్ కేసు నుంచే తాము ప్రేరణ పొందినట్లుగా నిందితుల్లో ఒకరు పేర్కొనడం విశేషం.

కుశాల్ అనే యువకుడు రెండేళ్ల నుంచి ఒక కాలేజీ విద్యార్థినితో ప్రేమలో ఉన్నాడు. మనస్పర్థలు వచ్చి కొన్ని నెలల నుంచి విడిపోయారు. అనంతరం అమ్మాయి మరొక యువకుడితో ప్రేమలో ఉంది. ఈ వ్యవహారం కుశాల్‌కు ఆగ్రహాన్ని తెప్పించింది. తనను మోసం చేసిందన్న కోపంతో మాజీ ప్రియురాలికి కుశాల్ అసభ్యకరమైన సందేశాలు పంపిస్తున్నాడు. దీంతో విసుగెత్తిపోయిన ఆమె.. తాజా ప్రియుడికి తెలియజేసింది. ఇక అంతే 10 మంది స్నేహితులతో కుశాల్‌ను కిడ్నాప్ చేసి ఒక నిర్మానుష ప్రాంతానికి తీసుకెళ్లి ఇష్టానురీతిగా దాడి చేశారు. కుశాల్ బట్టలు విప్పి ప్రైవేటు భాగాలపై కిరాతకంగా దాడి చేశారు. వైరల్ అవుతున్న వీడియోలో ఒక నిందితుడు మాట్లాడుతూ… దర్శన్ కేసు నుంచే తాము ప్రేరణ పొందినట్లుగా చెబుతున్న మాటలు వినిపించాయి. ఆ కేసును ప్రస్తావిస్తూ నవ్వుతూ కనిపించాడు.

దాడి కేసులో ఇప్పటి వరకు ఎనిమిది మందిని అరెస్ట్ చేసినట్లు పోలీసులు తెలిపారు. మాట్లాడుకుందామని పిలిచి.. కారులో తీసుకొచ్చి దాడి చేశారని పోలీసులు పేర్కొన్నారు.

ప్రియురాలికి అసభ్య సందేశాలు పంపించాడన్న కారణంతో అభిమాని రేణుకాస్వామిని జూన్ 8, 2024న కిడ్నాప్ చేసి నటుడు దర్శన్ చంపేశాడు. ఈ కేసులో ప్రియురాలు పవిత్ర, నటుడు దర్శన్‌ను జూన్ 11న అరెస్ట్ చేశారు. కొన్ని నెలల పాటు జైల్లో ఉన్న తర్వాత బెయిల్ వచ్చింది. ఆర్ధిక వివాదం అంటూ మరో నలుగులు కూడా పోలీసుల ఎదుట లొంగిపోయారు. ఈ కుట్రలో మొత్తం 15 మంది పాల్గొన్నారు.

Tags

Next Story