Jyoti Malhotra: గూఢచారి యూట్యూబర్ జ్యోతి మల్హోత్రా అసలేం చేసింది ?

Jyoti Malhotra:   గూఢచారి యూట్యూబర్  జ్యోతి మల్హోత్రా అసలేం చేసింది ?
X
భారత సైనిక రహస్యాలు పాక్‌కు చేరవేత

దేశ భద్రతకు సంబంధించిన కీలక సమాచారాన్ని పాకిస్థాన్‌కు చేరవేస్తున్నారన్న సంచలన ఆరోపణలతో హర్యానాలో జ్యోతి మల్హోత్రా అనే యూట్యూబర్‌ను పోలీసులు అరెస్టు చేశారు. ఆశ్చర్యకరంగా, ఈమె రెండేళ్ల క్రితం సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌లో జరిగిన వందే భారత్ రైలు ప్రారంభోత్సవ కార్యక్రమంలో కలకలం సృష్టించిన మహిళే కావడం గమనార్హం.

హర్యానాకు చెందిన జ్యోతి మల్హోత్రా అనే మహిళ యూట్యూబర్‌గా కొనసాగుతూనే, పాకిస్థాన్ గూఢచార సంస్థ ఐఎస్ఐ (ఇంటర్-సర్వీసెస్ ఇంటెలిజెన్స్)కు ఏజెంట్‌గా పనిచేస్తున్నట్లు నిఘా వర్గాలు గుర్తించాయి. భారత సైనిక దళాలకు చెందిన అత్యంత రహస్యమైన సమాచారాన్ని ఈమె పాకిస్థాన్‌కు చేరవేస్తున్నట్లు నిర్ధారణ కావడంతో హర్యానా పోలీసులు ఆమెను అదుపులోకి తీసుకున్నారు. ఈమెతో పాటు ఈ వ్యవహారంలో ప్రమేయమున్న మరో ఆరుగురిని కూడా అరెస్టు చేసినట్లు సమాచారం. జ్యోతి ట్రావెల్ వీసాపై పాకిస్థాన్‌లో కూడా పర్యటించినట్లు దర్యాప్తులో తేలింది.

ప్రస్తుతం 5 రోజుల పోలీసు కస్టడీలో ఉన్న జ్యోతి మల్హోత్రాకు చెందిన యూట్యూబ్, ఇన్‌స్టాగ్రామ్ వీడియోలను పోలీసులు క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. అందులో భాగంగా ఓ వీడియోలో దిల్లీలోని పాక్ ఎంబసీలో డానిష్ అనే దాయాది అధికారి ఇచ్చిన ఇఫ్తార్ విందులో జ్యోతి మల్హోత్రా పాల్గొన్నట్టు ఉంది. ఇఫ్తార్‌ ఏర్పాట్లను ప్రస్తావిస్తూ సూపర్‌గా డూపర్‌గా ఉన్నాయని ఆమె కొనియాడింది. ఈ ఈవెంట్‌లోనే పాకిస్థాన్ జాతీయ దినోత్సవం గురించి జ్యోతి మల్హోత్రా, డానిష్ మాట్లాడుకుంటున్నట్టు ఉంది. దిల్లీలోని పాక్‌ ఎంబసీలో ఇఫ్తార్ కార్యక్రమానికి వచ్చిన మిగతా వారితో జ్యోతి మల్హోత్రా కొంత సేపు మాట్లాడింది. వారిలో ఎవరైనా పాకిస్థాన్‌కు వెళ్లారా అని అడిగింది. వెళ్తే ఆ అనుభవాన్ని పంచుకోవాలని కోరింది. తనకూ పాకిస్థాన్‌కు వెళ్లాలని ఉందనీ కార్యక్రమానికి హాజరైన వారితో పేర్కొంది.

డానిష్ సహకారంతో యూట్యూబర్ జ్యోతి మల్హోత్రా పాకిస్థాన్‌కు 4 కంటే ఎక్కువసార్లు వెళ్లినట్టు అధికారిక వర్గాలు వెల్లడించాయి. జ్యోతి మల్హోత్రా యూట్యూబ్ ఛానెల్‌లో ఆమె పాకిస్తాన్ పర్యటనను డాక్యుమెంట్ చేసిన అనేక వీడియోలు ఉన్నాయి. వాటిలో "పాకిస్థాన్‌లో భారత అమ్మాయి", "లాహోర్‌ను అన్వేషిస్తున్న భారత అమ్మాయి", "కటాస్ రాజ్ ఆలయంలో భారత అమ్మాయి", "పాకిస్థాన్‌లో లగ్జరీ బస్సును నడిపిన భారత అమ్మాయి" వంటి శీర్షికలు ఉన్నాయి. పాకిస్థాన్ మాజీ ప్రధాని నవాజ్‌ షరీఫ్ కుమార్తె మరియం నవాజ్ షరీఫ్‌ను ఈ యూట్యూబర్‌ కలిసినట్టు ఓ ఇస్టాగ్రామ్ వీడియోలో లభ్యమైంది. దిల్లీలోని పాకిస్థాన్‌ ఎంబసీలో డానిష్‌తో ఈ యూట్యూబర్ చాలా సార్లు కలిసినట్టు పోలీసుల విచారణలో తేలింది. పాకిస్థాన్ నిఘా వర్గాల అధికారులతో టచ్‌లో ఉందని తేలింది. వాట్సాప్‌, టెలిగ్రామ్, స్నాప్‌చాట్‌ను ఉపయోగించి భారత ఆర్మీకి చెందిన సున్నితమైన సమచారాన్ని పాక్‌కు చెరవేసినట్టు అధికారిక వర్గాలు తెలిపాయి. జ్యోతి మల్హోత్రా జమ్మూకశ్మీర్‌లోని శ్రీనగర్‌ సహా కొన్ని ప్రాంతాల్లో పర్యటించింది. ఈ నేపథ్యంలోనే మరింత లోతుగా ఆమెను విచారిస్తున్నట్టు తెలుస్తోంది.

సికింద్రాబాద్ ఘటనతో లింక్?

సుమారు రెండేళ్ల క్రితం సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌లో జరిగిన వందే భారత్ రైలు ప్రారంభోత్సవ వేడుకల్లో జ్యోతి మల్హోత్రా హంగామా చేసినట్లు అప్పట్లో వార్తలు వచ్చాయి. ఆ కార్యక్రమానికి కిషన్ రెడ్డి, బండి సంజయ్, నాటి తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ హాజరయ్యారు. ఆ సమయంలో జ్యోతి అక్కడ కలకలం సృష్టించడంతో భద్రతా సిబ్బంది ఆమెను అదుపులోకి తీసుకుని పంపించివేసినట్టు తెలుస్తోంది.

తాజాగా, పాకిస్థాన్ ఐఎస్ఐ ఏజెంట్‌గా పట్టుబడటంతో, అప్పటి ఆమె ప్రవర్తన వెనుక ఏదైనా కుట్రకోణం ఉందా అనే కోణంలో కూడా అధికారులు దర్యాప్తు చేసే అవకాశం ఉంది. ప్రస్తుతం జ్యోతి అరెస్టుతో పాటు, ఆమె నెట్‌వర్క్, గతంలో ఆమె కార్యకలాపాలపై పోలీసులు లోతుగా విచారణ జరుపుతున్నారు. ఈ ఘటన దేశ భద్రతకు సంబంధించిన అంశం కావడంతో జాతీయ దర్యాప్తు సంస్థలు కూడా రంగంలోకి దిగే అవకాశాలున్నాయి.కాగా, కొన్ని నెలల కిందటే ఆమె పహల్గామ్ ను సందర్శించినట్టు వార్తలు వస్తున్నాయి. అందుకు సంబంధించిన కొన్ని ఫొటోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి. దాంతో, పహల్గామ్ ఉగ్రదాడికి ఆమెకు లింక్ ఏమైనా ఉందా అని సందేహాలు వ్యక్తమవుతున్నాయి.

Tags

Next Story