Sridhar Vembu: మా కంపెనీలో ఉద్యోగానికి డిగ్రీ అవసరం లేదు.. జోహో ఫౌండర్

తన కంపెనీలో ఉద్యోగానికి డిగ్రీ అవసరం లేదని జోహో కార్పొరేషన్ సహ వ్యవస్థాపకుడు శ్రీధర్ వెంబు స్పష్టం చేశారు. ఆయన తరుచూ సామాజిక మాధ్యమాల్లో తన అభిప్రాయాలను పంచుకుంటారు. తాజాగా డిగ్రీ చదువుల గురించి 'ఎక్స్' వేదికగా స్పందించారు.
తమ సంస్థలో ఉద్యోగం పొందడానికి డిగ్రీ తప్పనిసరి కాదని ఆయన పేర్కొన్నారు. డిగ్రీ చదవాలంటూ పిల్లలపై తల్లిదండ్రులు ఒత్తిడి చేయకూడదని సూచించారు. ప్రస్తుతం అమెరికాలో కొంతమంది ప్రతిభావంతులైన విద్యార్థులు కళాశాలలకు వెళ్లడం మానేస్తున్నారని, ముందుచూపు కలిగిన సంస్థలు వారికి అవకాశాలు కల్పిస్తున్నాయని ఆయన అన్నారు. ఒక కాగితం ముక్క కంటే ప్రతిభ, నేర్చుకోవాలనే ఆసక్తి చాలా ముఖ్యమని ఆయన అభిప్రాయపడ్డారు. డిగ్రీల కోసం అప్పులు చేసే బదులు, ఆచరణాత్మక నైపుణ్యాలను మెరుగుపరుచుకోవడం మేలని, దీని ద్వారా యువత ప్రపంచాన్ని చూసే విధానం మారుతుందని ఆయన అన్నారు.
ఈ తరహా మార్పును తల్లిదండ్రులు అర్థం చేసుకొని, పిల్లలు ప్రత్యామ్నాయ మార్గాలను ఎంచుకునేలా ప్రోత్సహించాలని శ్రీధర్ వెంబు సూచించారు.
మన దేశంలో ఇలాంటి ఆలోచనా ధోరణి ఉండాలని, ఉద్యోగంలోనే నేర్చుకునే అవకాశాన్ని జోహో వంటి సంస్థలు కల్పిస్తున్నాయని ఒక నెటిజన్ వ్యాఖ్యానించారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com

