Commonwealth Games 2022: కామన్‌వెల్త్ గేమ్స్‌లో భారత్.. ఒకరికి సంతోషం.. మరొకరికి దు:ఖం..
Commonwealth Games 2022: కామన్వెల్త్ 2022లో భారత్ సత్తా చాటుతోంది. పతకాలను పట్టడంతో పాటు కొత్త రికార్డులను సృష్టిస్తోంది. మహిళల 10 వేల మీటర్ల రేస్ వాక్‌లో భారత్ అదరగొట్టింది. భారత క్రీడాకారిణి ప్రియాంక గోస్వామి అద్భుత ప్రదర్శన చేసి రజత పతకాన్ని కైవసం చేసుకుంది. ప్రియాంక 43:38.82లో రేసును పూర్తి చేసింది. ఈ విజయంతో ప్రియాంక గోస్వామి సరికొత్త చరిత్ర సృష్టించింది. కామన్వెల్త్ గేమ్స్‌లో పతకం సాధించిన తొలి భారతీయ మహిళా క్రీడాకారిణిగా నిలిచింది.
కామన్వెల్త్ ఉమెన్స్ హాకీ సెమీఫైనల్ పోరులో భారత జట్టుకు నిరాశ తప్పలేదు. అంపైర్ తప్పిదం కారణంగా ఉమెన్స్ హాకీ జట్టు.. ఆసీస్ చేతిలో 3-0 తేడాతో ఓటమిపాలైంది. ఆస్ట్రేలియా, భారత్ మధ్య జరిగిన పోరులో మ్యాచ్ ముగిసే సమయానికి ఇరు జట్లు 1-1తో సమంగా నిలిచాయి. దీంతో పెనాల్టీ షూటౌట్ నిర్వహించారు. ఆస్ట్రేలియా డిఫెండర్ రోసీ మలోనే షూటౌట్ తొలి ప్రయత్నంలో కొట్టిన షాట్‌ను భారత గోల్‌కీపర్ సవితా అడ్డుకుంది.
దాంతో ఆసీస్ జట్టుకు ఒక పెనాల్టీ వృథా అయిందని అందరూ భావించారు. అయితే ఇంతలో అంపైర్ వచ్చి ఆమెను మళ్లీ షూటౌట్ చేయమని కోరారు. ఇదేంటని భారత ఆటగాళ్లు అడిగితే.. షూటౌట్ క్లాక్ టైంలో తప్పిదం ఉందని, మళ్లీ ప్రారంభించాలని అంపైర్ తెలిపారు. దాంతో మలోనే వచ్చిన ఛాన్స్‌ను సద్వినియోగం చేసుకుని గోల్ కొట్టింది. భారత్ మాత్రం ఒక్క గోల్ చేయలేకపోయింది.
ఉమెన్స్ హాకీ సెమీఫైనల్‌లో అంపైర్ తప్పిదంపై భారత హాకీ జట్టు సహా క్రీడాకారులు, నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. గడియారం మిస్టేక్ అని చెప్పడం సిల్లీగా ఉందని మాజీ క్రికెటర్ సెహ్వాగ్ అన్నారు. అంపైర్ తీరుపై స్పందించిన అంతర్జాతీయ హాకీ సమాఖ్య.. తప్పైపోయింది క్షమించాలని భారత్‌ను కోరింది.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com