Nikhat Zareen: కామన్వెల్త్‌లో తెలంగాణ మహిళా బాక్సర్ నిఖత్ జరీన్‌కు స్వర్ణం..
Nikhat Zareen: తెలంగాణ అమ్మాయి, ప్రపంచ ఛాంపియన్ నిఖత్ జరీన్..కామన్వెల్త్ క్రీడల్లో అద్భుత ప్రదర్శనతో సత్తా చాటింది. బర్మింగ్‌హామ్ వేదికగా జరిగిన ఉమెన్స్ 48-50 కేజీల ఫ్లైవెయిట్ ఫైనల్స్‌లో నిఖత్ జరీన్..నార్త్ ఐర్లాండ్ బాక్సర్ కార్లీ మెక్‌నాల్‌ని 5-0 తేడాతో చిత్తు చేసి గోల్డ్ మెడల్ సాధించింది. ఫైనల్ మూడు రౌండ్లలోనూ ఆరంభం నుంచే శివంగిలా విరుచుకుపడిన నిఖత్.. తన పవర్ పంచ్‌లతో ప్రత్యర్థిని ఉక్కిరిబిక్కిరి చేసింది. ఐదుగురు జడ్జిలు..మూడు రౌండ్లలోనూ నిఖత్ జరీన్‌కి 10 స్కోర్లు వేయగా.. కార్లీకి మాత్రం ఏ రౌండ్‌లోనూ ఒక్క జడ్జి 10 స్కోరు ఇవ్వలేదు.
అటు క్వార్టర్స్‌లో వేల్స్ బాక్సర్ హెలెన్ జోన్స్‌పై 5-0 తేడాతో నెగ్గిన నిఖత్.. సెమీస్‌లోనూ ఇంగ్లాండ్ బాక్సర్ సావనా అల్ఫియాపై 5-0తో అదరగొట్టి ఫైనల్‌ల్లోకి అడుగు పెట్టింది. ఫైనల్లోనూ నిఖత్ అదే దూకుడు ప్రదర్శిచింది. తుదిపోరులోనూ కార్లేపై 5-0తో గెలిచి పసిడి పతకం కొల్లగొట్టింది. నిఖత్ అందించిన తాజా స్వర్ణంతో భారత పతకాల సంఖ్య 48కి పెరిగింది. ఇందులో 17 స్వర్ణాలు, 12 రజతాలు, 19 కాంస్యాలు ఉన్నాయి. పతకాలతో ఆస్ట్రేలియా టాప్‌లో దూసుకెళ్తోంది. నిఖత్ జరీన్ గోల్డ్ మెడల్‌తో న్యూజిలాండ్‌ని వెనక్కి నెట్టి భారత్ నాలుగో స్థానానికి ఎగబాకింది.
నిజామాబాద్ జిల్లాకు చెందిన 26 ఏళ్ల నిఖత్ జరీన్ ఈ సీజన్‌లో ఇప్పటికే 2వ స్ట్రాండ్జా మెమోరియల్ బాక్సింగ్ టోర్నమెంట్, ప్రపంచ ఛాంపియన్‌షిప్ స్వర్ణ పతకాలను తన ఖాతాలో వేసుకుంది. తాజాగా కామన్వెల్త్ గేమ్స్‌లో తొలి స్వర్ణం అందుకున్న నిఖత్‌కు ఇది హ్యాట్రిక్ గోల్డ్ మెడల్ కావటం విశేషం. నిఖత్ జరీన్ గోల్డ్‌మెడల్ సాధించడంతో సీఎం కేసీఆర్ హర్షం వ్యక్తం చేశారు. కేసీఆర్ ఆమెకు స్వయంగా ఫోన్ చేసి అభినందించారు. జరీన్ గెలుపుతో తెలంగాణ కీర్తి మరోసారి విశ్వవ్యాపితమైందని అన్నారు. సత్తా చాటిన తెలంగాణ అమ్మాయి నిఖత్ జరీన్ ను పీసీసీ ఛీప్ రేవంత్ రెడ్డి అభినందిస్తూ ట్వీట్ చేశారు
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com