వారాహి రెడీ.. 14నుంచి ప్రజల్లోకి పవన్

వారాహి రెడీ.. 14నుంచి ప్రజల్లోకి పవన్

పవన్ కల్యాణ్ వారాహి యాత్రకు ముహూర్తం ఖరారు అయ్యింది. యాత్రకు సంబంధించిన రూట్‌ మ్యాప్‌ను సిద్ధం చేశామని జనసేన పీఏసీ ఛైర్మన్ నాదెండ్ల మనోహార్‌ తెలిపారు. 14వ తేదీ నుంచి ప్రజల్లోకి వెళ్లనున్నట్లు వెల్లడించారు. నాదెండ్ల ప్రకటనతో జనసైనికుల్లో ఉత్సాహం నెలకొంది. అన్నవరం సత్యదేవుని ఆలయంలో ప్రత్యేక పూజల తర్వాత... పత్తిపాడు నుంచి యాత్రను ప్రారంభించనున్నారు. అన్నవరం నుంచి భీమవరం వరకు పవన్‌ తొలి విడత యాత్ర సాగనుంది. తూర్పు గోదావరి జిల్లాలోని పది నియోజకవర్గాల్లో పవన్ పర్యటించనున్నారు. ప్రతి నియోజకవర్గంలో రెండు రోజులు పవన్ కళ్యాణ్ ఉండేలా రూట్‌ మ్యాప్ సిద్ధమయ్యింది. యాత్రకు సంబంధించిన ఏర్పాట్లపై జనసేన ముఖ్య నాయకులు మంగళగిరిలోని జనసేన రాష్ట్ర కార్యాలయంలో సమావేశమై చర్చించారు. యాత్రకు సంబధించిన రూట్‌ మ్యాప్‌ను ఫైనలైజ్ చేశారు.

క్షేత్రస్థాయిలో ఉన్న సమస్యలపై ప్రజలకు అవగాహన కల్పించేలా యాత్ర సాగనుంది. రోజూ ఉదయం స్థానికంగా ఉన్న నాయకులతో పవన్‌ సమావేశం అవుతారు. అక్కడ ఉన్న సమస్యలను కూడా అడిగి తెలుసుకుంటారు. సమస్యల పరిష్కారం కోసం అవసరమైతే అక్కడ కూడా స్థానికంగా పర్యటిస్తారు..ప్రతి నియోజకవర్గంలో స్థానిక ప్రజలు, జనసేన నాయకులతో పవన్‌కళ్యాణ్‌ సమావేశం కానున్నారు. మహిళలు, రైతులు, యువత ఎదుర్కొంటున్న సమస్యలపై పవన్ దృష్టి సారించనున్నారు. కళాకారులు, కల్లుగీత కార్మికులు, భవన నిర్మాణ కార్మికులు, రైతులు, మహిళలు, మత్స్యకారులు, చేనేత కార్మికులు ఇలా అన్ని వర్గాల వారితో పవన్ సమావేశం అవుతారు. ప్రభుత్వ వైఫల్యాలను ప్రజలకు వివరిస్తూ పవన్‌ ముందుకు సాగనున్నారు. ప్రజల కోసం చేయదలుచుకున్న కార్యక్రమాలను పవన్‌ వివరించనున్నారు.

మొత్తంగా జనసేన ఎన్నికల శంఖారావం మోగించింది. ప్రజా సమస్యలు తెలుసుకుంటూ.. ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టేలా యాక్షన్ ప్లాన్ రెడీ చేస్తున్నారు జనసైనికులు. పవన్ నిర్ణయంతో అభిమానులు, పార్టీ నేతల్లో మరింత ఉత్సాహం నెలకొంది.

Tags

Next Story