21 రోజుల పాటు తెలంగాణ దశాబ్ది ఉత్సవాలు

21 రోజుల పాటు తెలంగాణ దశాబ్ది ఉత్సవాలు

తెలంగాణ దశాబ్ది ఉత్సవాలు ఊరూవాడా ఘనంగా జరుగుతున్నాయి. రాష్ట్రం అవతరించాక అభివృద్ధి, సంక్షేమంతో సహా వివిధ రంగాల్లో అమలు చేసిన కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లి, వారి భాగస్వామ్యంతో ఉత్సవాలను 21 రోజులపాటు ప్రభుత్వం ఘనంగా నిర్వహించనుంది.సుదీర్ఘ ఉద్యమం ద్వారా స్వరాష్ట్రం సిద్ధించాక తన ముద్రను చాటుకొనేలా చేపట్టిన కార్యక్రమాలు దేశానికే ఆదర్శమని చెబుతున్న ప్రభుత్వం ఒక్కో రోజు ఒక్కో రంగంలో సాధించిన అభివృద్ధిని కళ్లకు కట్టేలా ఉత్సవాలను నిర్వహించేందుకు ప్లాన్ చేసింది.

2014 జూన్‌ 2న తెలంగాణ ఆవిర్భావం నుంచి కేసీఆర్‌ నాయకత్వంలోని ప్రభుత్వం సాగు, తాగు, పారిశ్రామిక, వైద్య తదితర రంగాల్లో చేసిన అభివృద్ధి, రైతుబంధు, రైతు బీమా, పరిపాలన వికేంద్రీకరణ ఇలా అనేక రంగాల్లో సాధించిన కృషిని వివిధ రూపాల్లో ప్రజలకు చెప్పనుంది.

ప్రతిష్ఠాత్మక కాళేశ్వరం ఎత్తిపోతల పథకం... దీని ద్వారా తెలంగాణలోకి అత్యధిక ప్రాంతానికి సాగు నీరు అందించడం, ఇతర సాగునీటి ప్రాజెక్టులను పూర్తి చేయడం, మిషన్‌ భగీరథ ద్వారా ఇంటింటికి తాగునీరు, వైద్య కళాశాలలు, ఆసుపత్రుల విస్తరణ ఐటీ, పారిశ్రామిక రంగాల్లో సాధించిన పెట్టుబడులు, వచ్చిన ఉద్యోగాలు, నూతన సచివాలయం, యాదాద్రి ఆలయ నిర్మాణం, 125 అడుగుల డా.బీఆర్‌ అంబేడ్కర్‌ విగ్రహం ఏర్పాటు, సమీకృత కలెక్టరేట్‌ భవనాలు, హరితహారం... ఇలా అనేక అంశాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లనున్నారు.

వరి సాగు, దిగుబడిలో తెలంగాణ అతి తక్కువ కాలంలో అనూహ్య ప్రగతి సాధించిన తీరునూ ఆవిష్కరించనుంది. అన్ని రంగాల్లోనూ తమదైన ముద్ర వేశామంటూ దశాబ్ది ఉత్సవాల్లో చాటిచెప్పనుంది.

Next Story