దశాబ్ది వేడుకల నేపథ్యంలో పొలిటికల్ హీట్‌

దశాబ్ది వేడుకల నేపథ్యంలో పొలిటికల్ హీట్‌

దశాబ్ది వేడుకల నేపథ్యంలో తెలంగాణలో పొలిటికల్ హీట్‌ పెరిగింది. రాజకీయ పార్టీలు ఎవరికి వారే వేడుకలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. ఇక ఇప్పటికే దశాబ్ది ఉత్సవాలకు తెలంగాణ ముస్తాబైంది. రేపటితో తెలంగాణ రాష్ట్రం పదో వసంతంలోకి అడుగు పెడుతుంది. ప్రత్యేక రాష్ట్రం కోసం జరిగిన పోరాటాలు, రాష్ట్ర అవతరణ అనంతరం జరిగిన అభివృద్ధి ప్రతిబింబించేలా దశాబ్ది ఉత్సావాల నిర్వాహణకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధం అయ్యింది. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా, తెలంగాణ ఘనకీర్తి దశ దిశలా చాటేలా పండుగ వాతావరణంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉత్సవాలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేసింది తెలంగాణ ప్రభుత్వం.

ఇక రేపు ఉదయం 10గంటల 30 నిమిషాలకు సచివాలయంలో సీఎం కేసీఆర్‌ జాతీయ జెండాను ఆవిష్కరిస్తారు. తెలంగాణ వ్యాప్తంగా ఉత్సవాలను ఘనంగా 21 రోజుల పాటు నిర్వహించనున్నారు. పదేళ్ల తెలంగాణ సాధించిన పురోగతి అర్థం అయ్యేలా ఓ లోగో రూపొందించారు. ఇక ఇందు కోసం 105కోట్ల రూపాయల నిధులు కేటాయించింది తెలంగాణ ప్రభుత్వం.

అటు బీజేపీ సైతం దశాబ్ది ఉత్సవాల వేడుకలు నిర్వహించేందుకు రెడీ అయ్యింది. గోల్కొండ కోట వేదికగా ఉత్సవాలకు ఏర్పాట్లు చేశారు. కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో ఘనంగా ఉత్సవాలు నిర్వహిస్తామని కిషన్ రెడ్డి అన్నారు. ఇక తెలంగాణ ఉద్యమాన్ని బీజేపీ ముందుండి నడిపిందని చెప్పారు. దేశవ్యాప్తంగా మొదటిసారి అన్ని రాష్ట్రాల రాజ్‌భవన్‌లలో తెలంగాణ దినోత్సవాన్ని నిర్వహిస్తున్నామన్నారు. 12 వందల మంది ఆత్మబలిదానాలతో తెలంగాణ ఏర్పాటు అయ్యిందని చెప్పిన కిషన్ రెడ్డి.. ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన వారందరూ ఈ వేడుకలకు హాజరవుతారని తెలిపారు.

మరోవైపు తెలంగాణ కాంగ్రెస్‌ సైతం ఉత్సవాలకు సర్వం సిద్ధం చేసింది. జూన్ రెండు నుంచి 20 రోజుల పాటు ఉత్సవాలు నిర్వహించేలా ఏర్పాట్లు చేశారు. గాంధీ భవన్‌ వేదికగా వేడుకలు నిర్వహించనున్నారు. రేపు ఉదయం 10గంటల 30 నిమిషాలకు గాంధీభవన్‌లో జాతీయ పథకాన్ని ఆవిష్కరించనున్నారు. 11గంటలకు నిజాం కాలేజీ వద్ద ఉన్న బాబు జగ్జీవన్‌ రాం విగ్రహం నుంచి భారీ ప్రదర్శన చేపట్టనున్నారు. అబిడ్స్‌లోని నెహ్రూ విగ్రహం, మొహంజాహి మార్కెట్‌ మీదుగా గాంధీభవన్‌ చేరుకోనున్నారు. అనంతరం సోనియా గాంధీకి కృతజ్ఞత సభను నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమానికి లోక్‌సభ మాజీ స్పీకర్‌ మీరాకుమార్‌ హాజరుకానున్నారు.

Tags

Read MoreRead Less
Next Story