ఆంధ్రప్రదేశ్ లో త్వరలో జరగనున్న శాసనసభ ఎన్నికలపై రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. వచ్చే ఎన్నికల్లో జగన్ ఓటమి ఖాయమని ఆయన స్పష్టంచేశారు. ప్రశాంత్ కిశోర్ గత ఎన్నికల్లో వైసీపీకి ఎన్నికల వ్యూహకర్తగా పనిచేశారు. తాజాగా హైదరాబాద్ లో ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన ప్రజాధనాన్ని ఖర్చు చేస్తూ.... ప్రజలను సంరక్షిస్తున్నామని అనుకోవడం సరికాదన్నారు. అలా అనుకున్నందుకు తెలంగాణలో కేసీఆర్ తగిన మూల్యం చెల్లించుకున్నారని.... ఇప్పుడు జగన్ వంతని చెప్పారు. ప్రజలు వనరుల నిర్వహణనే కాకుండా నాయకుడి శక్తి సామర్థ్యాలను కూడా చూస్తారని వివరించారు. ప్రజలు ఓటు వేసే ముందు తప్పకుండా అభివృద్ధిని చూస్తారని ప్రశాంత్ కిశోర్ అన్నారు. ఉదారంగా ఉచితాలు ఇస్తేనే ఓట్లు వస్తాయని అనుకోవడం సరికాదన్నారు. జగన్ ను ఓడించడం కష్టమనికొందరు భావిస్తారని... కానీ జగన్ పనైపోయిందని పరోక్ష వ్యాఖ్యలు చేశారు. కొంతమంది రాజకీయ నేతలతో పనిచేసినందుకు మీరు బాధపడుతున్నారా అన్న ప్రశ్నకు... తాను బాధపడనని,వారి నుంచి గుణపాఠాలు నేర్చుకుంటానని ప్రశాంత్ కిశోర్ తెలిపారు.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com