
వైసీపీ హయాంలో గన్నవరం టీడీపీ కార్యాలయంపై జరిగిన దాడి కేసులో నిందితుల అరెస్టు పర్వం కొనసాగుతోంది. ఇప్పటికే పలువురిని అరెస్టు చేసిన పోలీసులు తాజాగా, మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ పీఏ రాజా సహా 11 మంది నిందితులను అరెస్టు చేశారు. శుక్రవారం తెల్లవారుజామున 11 మంది వంశీ అనుచరులను అరెస్టు చేసి పోలీసు స్టేషన్ కు తరలించారు. విజయవాడ రూరల్, గన్నవరం, బాపులపాడు, ఉంగుటూరుకు చెందిన మరి కొందరిని కూడా పోలీసులు అదుపులోకి తీసుకునే అవకాశం ఉందని అంటున్నారు.
ఈ ఏడాది ఫిబ్రవరి 20వ తేదీన గన్నవరం టీడీపీ కార్యాలయంపై నాటి ఎమ్మెల్యే వల్లభనేని వంశీ అనుచరులు, వైసీపీ నేతలు దాడి చేసి నిప్పు పెట్టిన సంగతి తెలిసిందే. కార్యాలయంలోని ఫర్నిచర్‌ను ధ్వంసం చేయడంతో పాటు పలువురు టీడీపీ నేతలను గాయపర్చి వాహనాలను తగులబెట్టారు. ఈ ఘటనకు సంబంధించి టీడీపీ కార్యాలయ ఆపరేటర్ సత్యవర్థన్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేసిన పోలీసులు..సీసీ కెమేరాలు, వీడియోల ద్వారా 71 మంది దాడికి పాల్పడినట్లుగా నిర్ధారించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పోలీసులు ఈ కేసు దర్యాప్తు వేగం పెంచడంతో నిందితులుగా ఉన్న చాలా మంది అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. దీంతో ఈ కేసులో నిందితులను దఫదఫాలుగా పోలీసులు అరెస్టు చేస్తున్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com